రాహుల్‌కి కడుపునొప్పికి కారణమేంటి?
posted on May 15, 2015 9:55AM

తెలంగాణ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కడుపు నొప్పి వచ్చింది. ఆయన జ్వరంతో కూడా బాధపడ్డారు. పాదయాత్ర కోసం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కి వచ్చిన ఆయన గురువారం రాత్రి కడుపునొప్పి, జ్వరంతో బాదపడ్డారు. వెంటనే ఆయన తనకు కేటాయించిన హోటల్ రూమ్‌కి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. తమ నాయకుడికి కడుపునొప్పి వచ్చిందని తెలియడంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్మల్‌లోని ఒక ప్రైవేట్ వైద్యుడిని రాహుల్ గాంధీ దగ్గరకి పంపించి వైద్య పరీక్షలు చేయించారు. ప్రయాణిక బడలిక కారణంగా జ్వరం వచ్చిందని, ఆహారం సరిపడకపోవడం వల్ల కడుపు నొప్పి వచ్చిందని డాక్టర్ నిర్ధారించి, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పడంతో కాంగ్రెస్ వర్గాలు తేరుకున్నాయి. అయితే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళను ఆపుకోలేక రాహుల్ గాంధీ తమకు దర్శనం ఇస్తేగానీ తమ మనసులు శాంతించవంటూ రాహుల్ బసచేసిన హోటల్ ముందు చేరి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వచ్చి, రాహుల్ బాగానే వున్నారని చెప్పడంతో వారు మనశ్శాంతి పొంది వెనుదిరిగారు.