దేశంలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా అణచివేస్తున్నారు : రాహుల్ గాంధీ
posted on Apr 26, 2025 6:12PM

దేశంలో ప్రస్తుతం ప్రతిపక్షాలన్ని మాట్లాడనివ్వకుండా గొంతునొక్కేవిధంగా ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో కొనసాగుతున్న భారత్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని రాహుల్ అన్నారు. ఆధునిక సామాజిక మాధ్యమాలతో అంతా మారిపోయిందన్నారు. తాను నిన్ననే రావాల్సి ఉన్నా, కశ్మీర్‌కు వెళ్లడం వల్ల రాలేకపోయానని, అందుకు క్షమించాలని కోరారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర (భారత్ జోడో యాత్ర) చేయాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ గాంధీ వివరించారు. తాను కశ్మీర్‌లో యాత్రను ముగించినట్లు గుర్తుచేశారు. ఈ పాదయాత్ర ద్వారా తాను ముఖ్యంగా రెండు విషయాలు నేర్చుకున్నానని ఆయన వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా మా ప్రత్యర్థులు కోపం, భయం, ద్వేషంపై గుత్తాధిపత్యం కలిగి ఉన్నారు. ఆ విషయంలో వారితో పోటీ పడటం మా వల్ల కాదు. కోపం, భయం, ద్వేషం విషయంలో వారు ప్రతిసారీ మమ్మల్ని అధిగమిస్తారు, ఓడిస్తారు" అని రాహుల్ పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనికోసం అనేక పథకాలను తీసుకొచ్చామన్నారు. దేశంలోనే అతిపెద్ద రైతు రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఇప్పటికే రూ.20 వేల కోట్లు రుణమాఫీ చేశామని చెప్పారు. అంతకు ముందు శంషాబాద్‌లొ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ హెచ్ఐసీసీకి బయలుదేరారు.