దటీజ్ రాహుల్ గాంధీ..దటీజ్ కాంగ్రెస్ పార్టీ

 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయినా ప్రతీసారి కాంగ్రెస్ పెద్దలు ఆత్మవిమర్శ చేసుకొంటామని నాలుగు పడికట్టు పదాలు పలుకుతుంటారు, కానీ వారు కేవలం ఆత్మా వంచన మాత్రమె చేసుకోగలరని వారు పదే పదే నిరూపిస్తుంటారు. ఎన్నిసార్లు ఓడిపోయినా తమ అలవాట్లను, ఆలోచనలను, పద్దతులను కనీసం మాట తీరుని కూడా మార్చుకోకపోవడమే కాంగ్రెస్ లక్షణంగా భావించవచ్చును.

 

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీని విమర్శిస్తూ అతను తన స్వలాభం కోసం అన్నదమ్ములులాగ మెలుగుతున్న ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి కూడా వెనుకాడరని ఆరోపించారు. అయితే ఎదుటవాడివైపు ఒక వ్రేలు చూపితే, మిగిలిన నాలుగు వేళ్ళు మనవైపే చూపుతాయనే అనే సంగతి బహుశః ఆయనకి మరి తెలుసో తెలియదో కానీ, తనను ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి, తన తల్లి సోనియాగాంధీ రాష్ట్ర విభజన చేసి తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని అందరికీ తెలుసు. పాము తన పిల్లలను తానే తింటుదన్నట్లు, సీమాంద్రాలో తమ స్వంత పార్టీని, అక్కడి కాంగ్రెస్ నేతల భవిష్యత్తుని సర్వనాశనం చేయడంతో వారు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు చెల్లాచెదురయిపోవడం యువరాజవారి దృష్టికి రాలేదో వచ్చినా అది పెద్ద తప్పుగా కనబడలేదో ఆయనకే తెలియాలి.

 

గురువింద గింజ సామెతలాగా రాహుల్ గాంధీ తన కోసం తన తల్లి చేసిన నిర్వాకం గురించి ప్రస్తావించకపోయినా తన ప్రతీ సభలో మోడీని విమర్శించడం మానడు. మోడీ తన స్వలాభం కోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుకొంటే, రాహుల్ గాంధీ స్వలాభం కోసం సోనియా గాంధీ, తెలుగు ప్రజలందరి జీవితాలతో, తన స్వంత పార్టీ నేతల జీవితాలతో కూడా చెలగాటమాడారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లుని ఆమోదింప జేసేందుకు నిస్సిగ్గుగా చేతులు కలిపిన ఈ రెండు జాతీయ పార్టీల ఎన్నికల రాజకీయాలు ఎలా ఉన్నపటికీ, వాటికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీమాంద్రాకు చేసిన ద్రోహానికి తగిన గుణపాటం చెప్పేందుకు ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ మేకపోతు గాంభీర్యం నటించడంలో కాంగ్రెస్ కు మించిన వారు ఉండరు గనుక చిరంజీవి వంటి వారు ఇంకా తమ బస్సు యాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన వచ్చిందని చెప్పుకోగలుగుతున్నారు.