ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టులో ప్రభుత్వ వ్యతిరేక తీర్పు వస్తుంది

వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనాను లెక్క చేయకుండా.. విద్యార్థుల ప్రాణాలను బలిపెట్టడం సరికాదని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు పాఠశాలలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టొద్దని, కరోనా తగ్గిన తర్వాతే పాఠశాలలను ప్రారంభించాలని సీఎం జగన్ ను కోరారు. స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని విమర్శించారు. జగన్ ఆవేశం తగ్గించుకుని, ఆలోచన పెంచుకోవాలని హితవు పలికారు.

 

మరోవైపు ఏపీ విద్యాశాఖ మంత్రికి రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టులో కచ్చితంగా వ్యతిరేక తీర్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో స్టే రాకపోతే హైకోర్టు ఉత్తర్వులను పాటించాలని అన్నారు. విద్యాబోధనను ఏ మీడియంలో ప్రారంభించబోతున్నారో ముందు చెప్పాలని రఘురామకృష్ణంరాజు కోరారు.