తమ వాళ్ళకే బిల్లులు క్లియర్.. వైసీపీ ప్రభుత్వం పై రఘురామకృష్ణరాజు ఫైర్
posted on Aug 31, 2020 6:17PM
ఏపీలో అధికారంలో ఉన్న వైసిపికి తలనొప్పిగా తయారైన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తమ వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు రూ. 25 వేల కోట్ల వరకు బకాయి పడిందని అయన చెప్పారు. అయితే ఒక సామాజికవర్గానికి సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు చెల్లించడం లేదని అయన విమర్శించారు. కనీసం ఉపాధి హామీ పనులు చేసిన వారికి కూడా డబ్బులు చెల్లించలేదని అంతేకాకుండా కేవలం తమ బంధువులైన కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారని అయన చెప్పారు.
తమ పార్టీలో విలువలు అనేవి కేవలం మాటలకే పరిమితమయ్యాయని... అయితే విలువలు అనేవి చేతల్లో కూడా ఉండాలని అయన తమ పార్టీ నాయకులకు హితవు పలికారు. కాంట్రాక్టర్ల కష్టాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడం లేదని రఘురామరాజు అన్నారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం కలలు కంటున్న మూడు రాజధానులు అనేది కేవలం భ్రమ మాత్రమేనని అయన ఎద్దేవా చేసారు.