రేపటి నుంచి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు

మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతులు

 

ఒక్కో క్లాస్ వ్యవధి అరగంటకు మించకుండా

 

దూరదర్శన్ , టీశాట్ ల ద్వారా విద్యార్థులందరికీ అందుబాటులో

 

కరోనా కారణంగా జూన్ లో ప్రారంభం కావల్సిన విద్యాసంవత్సరం సెప్టెంబర్ నుంచైనా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే అనేక ప్రైవేట్ స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఆన్ లైన్ క్లాసులు రేపటి(సెప్టెంబర్ 1) నుంచి ప్రారంభిస్తున్నారు. 

 

మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు దూరదర్శన్, టీశాట్ ద్వారా డిజిటల్ తరగతులను నిర్వహిస్తారు. ఈ మేరకు టైమ్ టేబుల్ ను కూడా విడుదల చేశారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్లాసులను నిర్వహిస్తారు. అయితే ఒక్కో క్లాసు వ్యవధి అరగంట ఉండాలని నిబంధనలు విధించారు. ఇక ఇంటర్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులను నిర్వహిస్తారు. 

 

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు నష్టపోకుండా ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నామని టీచర్లు, తల్లిదండ్రులు విద్యార్థులు క్లాసులు వినేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది.