మన పాలకులకి .... ఆటలంటే ఆటైపోయింది!

సింధు సిల్వర్ గెలిచింది. దేశం మొత్తం మురిసిపోయింది. అయితే, ఒక్కటి మాత్రం శేష ప్రశ్నగానే మిగిలిపోయింది. ఎందుకని ఇన్ని కోట్ల జనాభా వున్న భారతదేశం జస్ట్ రెండు మెడల్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది? అందుకు అసలు రీజన్ ఈ స్టోరీ వింటే మీకే తెలుస్తుంది!


అనగనగా ఓ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆయన ఇండియాలో ఎవ్వరూ పట్టించుకోని షటిల్ అండ్ కాక్ గేమ్ ని ఎంతగానో ప్రేమించాడు. తాను సరైన సౌకర్యాలు లేక ఒలంపిక్స్ మెడల్ సాధించలేకపోయినందుకు ఓ బ్యాడ్మింటన్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ పెట్టాలనుకున్నాడు. ఒలంపిక్స్ మెడల్స్ కల తన శిష్యుల ద్వారా నిజం చేసుకోవాలనుకున్నాడు. ఇదంతా 2003 నాటి మాట. కట్ చేస్తే... 


2016లో సదరు బ్యాడ్మింటన్ ద్రోణాచార్యుడి శిష్యురాలే సింధు. రియో ఒలంపిక్స్ లో ఆమె సాధించిన సిల్వర్ మొత్తం దేశానికి గర్వకారణమైంది. ఇంతే కాదు, పోయిన ఒలంపిక్స్ లో సైనా కూడా ఆయన కోచింగ్ లోనే కాంస్యం కొట్టింది! ఇలా రెండుసార్లు భారతదేశానికి బ్యాడ్మింటన్లో పతకాలు సాధించిపజేసిన ఆ గురువు పుల్లెల గోపిచంద్. ఆయనకి మన ప్రభుత్వాలు, పొలిటీషన్స్ ఇస్తున్న ప్రొత్సాహం ఏంటో తెలుసా?


ఏ చిన్న గ్రౌండ్లో ఎంత చిన్న టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వచ్చినా మన రాజకీయ నాయకులు తాము క్రీడల అభివృద్ధికి కట్టుబడి వున్నామని ఉపన్యాసాలు దంచేస్తారు. కాని, తన జీవితమే బ్యాడ్మింటన్ కు అంకితం చేసి వజ్రాల్లాంటి శిష్యులని తయారు చేస్తున్న గోపిచంద్ కు మాత్రం ఎలాంటి ఎంకరేజ్‌మెంట్ దక్కలేదు, సరి కదా 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గచ్చిబౌలి దగ్గర ఇచ్చిన 5ఎకరాల్లో మూడెకరాలు తిరిగి లాక్కునేందుకు కుట్ర జరిగింది.  చంద్రబాబు తరువాత సీఎం అయిన వైఎస్ గచ్చిబౌలి వద్ద అత్యంత ఖరీదైన 5ఎకరాల భూమి గోపిచంద్ అకాడమికీ వుండటం గమనించి తనదైన స్టైల్లో కథ నడిపించారు. బ్యాడ్మింటన్ కు ప్రొత్సాహం ఇవ్వాల్సిన ముఖ్యమంత్రే స్వయంగా అకాడమికీ రెండెకరాలు చాలు, స్విమ్మింగ్ పూల్, రన్నింగ్ ట్రాక్ లాంటివి ఎందుకంటూ జీవో జారీ చేశారు. దాని ప్రకరాం 3ఎకరాలు గవర్నమెంట్ వెనక్కి తీసుకోబోయింది. కాని, గోపిచంద్ కోర్టుకు వెళ్లటంతో ఆ ప్రయత్నం మధ్యలో ఆగిపోయింది. 

 


వైఎస్ తరువాత సీఎం అయిన మరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రోశయ్య కూడా బ్యాడ్మింటన్ భూమిల్ని లాక్కునే జీవో ఉపసంహరించలేదు. తరువాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డిగాని, ఇప్పటి కేసీఆర్ గాని అలాంటి పని చేసినట్లు దాఖలాలు లేవు. ఇదీ మన ప్రభుత్వాల క్రీడాభివృద్ధి కాంక్ష! బడా కార్పోరేట్లకు రైతుల పొలాలు లాక్కుని మరీ భూములు దానం ఇయ్యటం సమర్థంగా చేసే మన నేతలు దేశానికి గర్వకారణం అయ్యే గోపిచంద్ అకాడమీ లాంటి వాటికి మాత్రం మూడెకరాల భూమి వదలకపోవటం నిజంగా విడ్డూరమే! ఆటలకు ప్రొత్సాహం ఇంతగా వుంది కాబట్టి ఒలంపిక్స్ లో మన ప్రతాపం ఆ రేంజ్లో వుంది మరి...