వడ్డించే వాడు మనవాడైనా....అర్థాకలితోనే ఆంధ్రా!

వడ్డించే వాడు మన వాడైతే ... అంటూ ఓ సామెత చెబుతారు. కాని, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీతో బీజేపి గత సార్వత్రిక ఎన్నికలకి ముందే జోడీ కట్టింది. పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగి ప్రచారం చేయటంతో ఆంధ్రా జనం ఎన్డీఏ కూటమికే అధికారం కట్టబెట్టారు. రాష్ట్రంలోనే కాదు ఢిల్లీలోనూ ఎన్డీఏ అధికారం చేపట్టింది. మొత్తం మీద లోటు బడ్జెట్ తో ఏర్పడ్డ నవ్యాంధ్ర వడ్డించే వాడు ఇక మనవాడే అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది... 
 

 ఢిల్లీలోని ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఆదుకుంటుందని ఆశించిన తెలుగు వారికి రెండేళ్లుగా నిరాశే ఎదురవుతోంది. అసలు ప్రత్యేక హోదానే ఇచ్చేస్తారని భ్రమపడ్డ వారికి ఇప్పుడు మెల్లగా మెల్లగా తత్వం బోధపడుతోంది. పోనీ ప్యాకేజీ అన్నా భారీగా ఇస్తారా అనుకుంటే అదీ హుళక్కేనని తాజా పరిణామాలతో తేలిపోయింది. 
  

పోయిన బీహార్ ఎన్నికలప్పుడు ఆ రాష్ట్రానికి కేంద్రం వేల కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేసింది. అలాగే, బీజేపి అధికారంలో లేని బుందేల్ ఖండ్ కి కూడా భారీగా ఆర్దిక సాయం అందుతూ వుంటుంది. కాని, టీడీపీతో కలిసి అధికారం చేపట్టిన ఆంద్రప్రదేశ్ బీజేపి మాత్రం ఢిల్లీలో ఏమీ చేయలేకపోతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఎన్నిసార్లు మాట్లాడినా ఫలితం వుండటం లేదు. బుందేల్ ఖండ్ తరహా భారీ ప్యాకేజ్ అని ఇంతకాలం ఆశించిన వారికీ అది ఇప్పుడు ఆకాశంలో మబ్బులా తేలిపోయింది. ఆర్దిక కరువులో వున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి కాసుల వర్షం కురవదని తేలిపోయింది. 

 

ఏపీ  సీఎం స్వయంగా వెళ్లి నాలుగు వేల కోట్లన్నా ఇవ్వమంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చింది ముష్టి రెండు వేల కోట్లు. అందులోనే లోటు బడ్జెట్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, రాజధాని నిర్మాణం అన్నీ చేసుకోమ్మని చల్లగా సెలవిచ్చింది. ఇంతకీ, 4వేల కోట్లు బదులు 2వేల కోట్లు ఇచ్చిన ఢిల్లీ సర్కార్ మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ఎంత పూడ్చాలో తెలుసా? అక్షరాలా 16వేల కోట్లు! అందులో ఇప్పటి దాకా దక్కింది 2800కోట్లు మాత్రమే! ఇది స్వయంగా చంద్రబాబే చెప్పిన మాట!
  

 ప్రత్యేక హోదా అసాద్యమని చెప్పకనే చెబుతూ, కనీసం ప్యాకేజీ కూడా పెద్ద మనసుతో ఇవ్వకుండా తెలుగు వారికి చుక్కలు చూపుతున్న హస్తిన పెద్దలు పోలవరం, విశాఖ రైల్వే జోన్ లాంటి హామీలు నిలబెట్టుకుంటారంటే అది దురాశే అవుతుంది. రాజ్యసభలో ఎంతో కీలకమైన టీడీపీ మద్దతు అప్పన్నంగా తీసుకుంటూ కూడా నవ్యాంధ్రని నిర్లక్ష్యం చేయటం శుద్ధమైన మోసమే అవుతుంది. మరి తదుపరి ఏం చేయాలో నిర్ణయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదే! టీడీపీ అధినేతగా ఆయన కఠినమైన నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎన్డీఏకి, ప్రధానంగా బీజేపికి అది పెద్ద డ్యామేజీనే! ఇప్పటికే పదమూడు జిల్లాల్లో ఖతమైన కాంగ్రెస్సే చక్కటి ఉదాహరణ...