ఆ నది కోసం రెండు రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి!

హర్యానా మన దేశంలోనే అత్యంత ధనికమైన రాష్ట్రాల్లో ఒకటి. పారిశ్రామికపరంగానే కాదు, వ్యవసాయపరంగా కూడా మిగతా రాష్ట్రాలకు ఈర్ష్య పుట్టించగల ప్రగతి ఈ రాష్ట్రానికి సొంతం. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రం చిక్కుల్లో ఉంది. ఒకవైపు జాట్‌ వర్గంవారు తమకు రిజర్వేషన్లు కావాలంటూ ఆందోళనకు ఉపక్రమిస్తుంటే, మరోవైపు పంజాబ్‌ తాను హర్యానాకు చుక్క నీరు కూడా వదిలేది లేదంటూ ఏకంగా ఒక తీర్మానాన్నే తన అసెంబ్లీలో ఆమోదించింది. హర్యానాకు నీరందించే సట్లెజ్‌-యమునా కాలువను నిర్మించేది లేదంటూ తేల్చిపారేసింది. ఎక్కడో హర్యానా, పంజాబ్‌ల మధ్య జరుగుతున్న గొడవకీ తెలుగు రాష్ట్రాలకీ సంబంధం ఏమిటి అనుకోవడానికి లేదు. ఎందుకంటే నీటి తగాదాలు ఎక్కడైనా ఒకే తీరున నడుస్తాయి. ఒకప్పుడు కలిసి ఉన్న పంజాబ్‌, హర్యానాల మధ్య నడుస్తున్న నీటి పంచాయితీ.... రేపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య కూడా మొదలవ్వచ్చు.

 

పంజాబ్‌ రాష్ట్రంలో అయిదు ముఖ్య నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఐదు నదులు ఉన్నాయి కాబట్టే, ఈ రాష్ట్రానికి పంజాబ్‌ అన్న పేరు వచ్చిందంటారు. ఈ నదులలో ఒకటి సట్లెజ్‌. పంజాబ్‌ రాష్ట్రం గుండా ప్రవహించే ఈ సట్లెజ్‌ నదిని, యమునా నదితో అనుసంధాంచాలని... తద్వారా పక్క రాష్ట్రాలకు కూడా సట్లెజ్‌ నీటిని అందించాలని పెద్దలు ఆశించారు. ఇందుకోసం 1981లో పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల మధ్య ఓ తీర్మానం జరిగింది. ఈ తీర్మానం ప్రకారం పంజాబ్‌ రాష్ట్రం సట్లెజ్‌- యమునా నదులను కలుపుతూ 214 కిలోమీటర్ల కాలువను నిర్మించాల్సి ఉంది. 1982లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధి, ఈ కాలువకు శంకుస్థాపన కూడా చేశారు. దాదాపు 750 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కాలువలో చాలా భాగాన్ని పూర్తి చేశారు కూడా.

 

రోజులు మారుతున్న కొద్దీ, నిదానంగా రాజకీయ నాయకులు మాట మార్చడం మొదలుపెట్టారు. పంజాబ్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు చుక్కనీరు కూడా వదిలేది లేదని తేల్చి చెప్పేశారు! తాము కాలువను పూర్తిచేయబోమని పంజాబ్‌ రాష్ట్రం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది కూడా. కానీ ప్రాజెక్టుని పూర్తి చేయాలంటూ సుప్రీం, పంజాబు ప్రభుత్వానికి అక్షింతలు వేయడమే కాకుండా... నిర్మాణాన్ని పూర్తి చేయమంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అదేశించింది. అందుకు తగిన భూమిని ఇవ్వమని 2004లో పంజాబు ప్రభుత్వానికి సూచనలందించింది. సుప్రీం తీర్పు వెలువడ్డాక పంజాబు ప్రభుత్వం ఓ అసాధారణ నిర్ణయాన్ని తీసుకుంది. ‘ఒప్పందాల రద్దు చట్టం’ (Punjab Termination of Agreements Act 2004) పేరిట ఒక అసాధారణ చట్టాన్ని అక్కడి అసెంబ్లీ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం, పంజాబ్‌ నీటి సంబంధించి ఇరుగుపొరుగు రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసుకుందన్నమాట. దాంతో విషయం మళ్లీ న్యాయస్థానాల చెంతకు చేరుకుంది.

 

ఒక పక్క ఈ వివాదం న్యాయస్థానాలలో ఉండగానే, పంజాబు అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడటం మొదలుపెట్టాయి. 2017లో జరగనున్న ఈ ఎన్నికలకి ముందు ఏదో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటే, ప్రజలకు దగ్గర కాగలమని అటు ప్రభుత్వమూ, ఇటు ప్రతిపక్షాలూ ఆలోచిస్తుండగా వారికి మళ్లీ సట్లెజ్‌- యమునా నది కాలువ వివాదం గుర్తుకు వచ్చింది. వెంటనే, తాము ఒకప్పుడు సదరు కాలువ కోసం సేకరించిన వేలాది ఎకరాలను తిరిగి రైతులకు అందిస్తామంటూ ప్రకటించింది పంజాబు ప్రభుత్వం. అంటే సట్లెజ్‌-యమునా నది కాలువ ప్రతిపాదనను పంజాబ్‌ శాశ్వతంగా పక్కకి పెట్టేందుకు ప్రయత్నించిందన్నమాట. ఈ నిర్ణయంతో కంగారుపడిన హర్యానా, ఆదరాబాదరాగా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. హర్యానా పడుతున్న ఆందోళనను గమనించిన సుప్రీం కోర్టు, యథాతథ (స్టేటస్‌ కో) స్థితిని ఆదేశించింది.

 

ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. గురువారం నాడు సుప్రీంకోర్టు స్టేటస్‌కోను విధిస్తూ ఆజ్ఞలు జారీ చేస్తే, శుక్రవారం నాడు తాము సట్లెజ్-యమునా కాలువకు వ్యతిరేకమంటూ పంజాబు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ కాలువకు ప్రతిపాదన ఎప్పుడో దశాబ్దాలకు పూర్వం వచ్చిందనీ, ప్రస్తుతం సట్లెజ్‌ నదిలో ఉన్న నీరు తమ అవసరాలకే సరిపోవనీ పంజాబు వాదిస్తోంది. నీరు తమకే చాలనప్పుడు, పక్క రాష్ట్రాలకు ఎలా అందించగలమన్నది పంజాబు వాదన. మరోవైపు హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాలేమో... తమకి కనుక సట్లెజ్‌ నీరు అందకపోతే లక్షలాది ఎకరాలు బీడు పోతాయని వాపోతున్నాయి.

 

కేవలం హర్యానా, పంజాబ్‌ల మధ్యే కాదు... మన దేశంలోని ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా ఇలాంటి వివాదాలే కనిపిస్తున్నాయి. ఈ వివాదాలను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్స్‌, న్యాయస్థానాలు ఎన్ని తీర్పులు ఇచ్చినా తగాదాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. నీటి వనరులు తగ్గిపోతున్న నేపథ్యంలో తాగు కోసం సాగు కోసం ప్రతి చుక్కా బంగారంకన్నా విలువైనదిగా మారిపోతోంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలను ఎప్పటికప్పుడు కూర్చుని పరిష్కరించుకుంటే కానీ సమస్యలు తీరేవి కావు. ఇందుకోసం భవిష్యత్తు అవసరాలనీ, కరువు వంటి విపత్తులనీ, ప్రజల భావోద్వేగాలనీ కూడా దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే సట్లెజ్ కోసం పంజాబు, హర్యానాలు కొట్టుకుంటున్నట్లే గోదావరి కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు గొడవపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఆ సూచనలు కనిపిస్తున్నాయి కూడా!