తప్పు విజయ్‌ మాల్యాదేనా?

విజయ్‌ మాల్యా పేరు ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే వస్తోంది. ఆయన ఖరీదైన జీవితం, జల్సారాయుడి అలవాట్లు. ఆయన రూపొందించే కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్లు, ఆఖరికి విజయ్‌ మాల్యా జీవన శైలిని అనుసరించే ఆయన పుత్రరత్నం... ఇవన్నీ కూడా నిత్యం వార్తల్లోనే ఉండేవి. ఎప్పుడైతే విజయ్‌ మాల్యా అప్పులపాలవడం మొదలుపెట్టాడో, జనాల కడుపు రగిలిపోవడం మొదలైంది. తాము పైసా పైసా కూడబెట్టిన సొమ్ముతో విజయ్‌ మాల్యా జల్సా చేయడం ఏంటని మంది మండిపడ్డారు. ఇంతకీ ఈ కింగ్‌ఫిషర్‌ ఎపిసోడ్లో విలన్ విజయ్ మాల్యా ఒక్కడేనా!

    వడ్డీలతో కలుపుకుని దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల సొమ్ముని విజయ్‌ మాల్యా బ్యాంకులకు రుణపడ్డాడని మీడియాలో నెల రోజుల నుంచీ మారుమోగిపోతోంది. అతను ఏ నిమిషంలో అయినా దేశం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని అందరూ అనుమానిస్తున్నారు. విజయ్‌ మాల్యా తప్పించుకోలేకుండా అతని మీద ఒక లుక్‌ ఔట్‌ నోటీసు కూడా ఏడాది కాలంగా ఉంది. కానీ అతను విజయ్‌వంతంగా ఈ నెల రెండో తేదీన, ఎలాంటి అడ్డంకీ లేకుండా దేశం దాటి వెళ్లిపోయాడు. సాంకేతిక కారణాల వల్ల, తాము మాల్యాను అడ్డుకోలేకపోయామని సీబీఐ చెబుతున్న మాట హాస్యాస్పదంగా ఉంది. బ్యాంకులన్నీ కూడా అతనికి వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయించనున్నాయన్న విషయం దేశం మొత్తానికీ తెలుసు. ఒక నిందితునిగా బోనులో నిలబడాల్సినవాడు చల్లగా జారుకునేందుకు సీబీఐ అలసత్వం ఉపయోగపడింది. ఫలితం! ఇప్పుడప్పుడే తాను ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం లేదని, లండన్‌లోని తన విలాసవంతమైన భవంతి నుంచి విజయ్‌ మాల్యా ట్వీట్‌ చేశాడు.

    సీబీఐ పరిస్థితి ఇంకా నయం. న్యాయపరంగా విజయ్‌ మాల్యా మీద ఎలాంటి చర్యలూ తీసుకునే అవకాశం లేదని చెప్పి ఊరుకుంది. కానీ ఆ అవకాశం ఉన్న బ్యాంకుల ప్రవర్తన మరీ దారుణం. విజయ్ మాల్యా విషయంలో బ్యాంకులు ఉదారంగా ప్రవర్తించిన తీరు చూస్తే మధ్యతరగతి ప్రజల కడుపు రగలక మానదు. మాల్యా ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేశాడని తెలిసినప్పటికీ (wilfull defaulter), ఆయన మీద కేసుని నమోదు చేసేందుకు బ్యాంకులు మీనమేషలు లెక్కించాయి. సీబీఐ స్వయంగా పూనుకుని ఆయన రుణాలకు సంబంధించి కేసులు నమోదు చేయవలసి వచ్చింది. న్యాయస్థానం గడప తొక్కేందుకు కూడా ఇలాంటి అలసత్వాన్నే ప్రదర్శించాయి బ్యాంకులు. సీబీఐ డైరక్టరు తీవ్రంగా మందలించిన తరువాత కానీ విజయ్‌ మాల్యా దేశం దాటిపోకుండా చూడాలంటూ, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించాయి. అప్పుడు కూడా కోర్టు సెలవలు, ఉద్యోగుల సెలవలు, పని ఒత్తిడి... అంటూ బ్యాంకులు నిదానంగా బయల్దేరేనాటికి విజయ్ దేశం విడిచి ఎగిరిపోయాడు.

    విజయ్‌ మాల్యా మీద చర్యలు తీసుకోవడం సంగతి అటుంచితే, అతనికి అంతంత రుణాలు ఎలా ఇచ్చారన్నది మొదటి ప్రశ్న. అదే ప్రశ్న న్యాయస్థానాలు అడిగినప్పుడు... కింగ్‌ఫిషర్‌ బ్రాండ్‌ పేరు చూసి అప్పులిచ్చాం అని బిక్కమొగం వేశారు బ్యాంకు ప్రతినిధులు. కానీ మాల్యాకు రుణాలు అందించడం కేవలం మానవ తప్పిదం కాదనీ, ఇదో భారీ కుంభకోణం అనీ పరిశోధనా సంస్థల అంచనా. ఉదా॥ ఐడీబీఐ బ్యాంకు, మాల్యాకు అందించిన 900 కోట్ల రుణంలో బ్యాంకు అధికారుల పాత్ర అనుమానాస్పదంగా ఉందని సీబీఐ భావిస్తోంది. విజయ్‌ మాల్యా ఆస్తులు మన దేశంలో పెద్దగా లేవని బ్యాంకులకు తెలుసు. ఆయన కింగ్‌ఫిషర్‌ సంస్థ నష్టాలలో నడుస్తోందనీ తెలుసు... తెలిసి తెలిసీ ఆయనకు అప్పులిచ్చిన బ్యాంకులు, ఇప్పుడు తమకే పాపం తెలియదంటే నమ్మడం ఎలా! విజయ్‌ మాల్యా బ్యాంకులకు చెడ్డపేరు తీసుకువచ్చాడంటూ అరుణ్‌ జైట్లీ వాపోవచ్చుగాక. కానీ బ్యాంకుల తీరూ అందుకు తగినట్లుగానే ఉంది.

    అసలు విషయం ఏమిటంటే విజయ్ మాల్యా ఆడిందే ఆట, పాడిందే పాటగా ఇన్నాళ్లూ సాగిపోయింది. కింగ్‌ఫిషర్‌ పేరుతో విమానాలని నడిపినప్పుడు టికెట్‌ రేట్లను అసాధారణంగా తగ్గిస్తే అడిగినవాడు లేడు. పదివేలు ఉండాల్సిన చోట వేయి రూపాయలకి టికెట్లని అందిస్తే... అది వ్యాపార నష్టాలకీ లేదా వ్యాపారంలో అవాంఛిత ధోరణులకీ దారితీస్తుందనీ ఎవరూ ఆయనను హెచ్చరించలేదు. విజయ్ మాల్యా దివాళీ తీసే స్థితిలో ఉన్నాడని తెలిసి కూడా రాజకీయ పార్టీలన్నీ అతణ్ని వెనకేసుకునే వచ్చాయి. 2002లో కాంగ్రెస్, జనతాదళ్ మద్దతుతో రాజ్యసభ సభ్యునిగా, 2010లో బీజేపీ, జనతాదళ్‌ మద్దతుతో రెండో దఫా రాజ్యసభ సభ్యునిగా దర్జాగా పార్లమెంటులో కూర్చున్నాడు. ఇప్పటికీ జనతాదళ్ నేత దేవెగౌడ ఆయనను వెనకేసుకునే వస్తున్నారు. విజయ్‌మాల్యా కర్ణాటక ముద్దు బిడ్డ అనీ, ఆయన మీద తనకి నమ్మకముందని చెప్పుకొస్తున్నారు.    అయ్యిందేదో అయిపోయింది. తప్పెవరిదైనా, వేల కోట్ల ప్రజల సొమ్ము నేలపాలైపోయింది. అందులో సగం సొమ్మైనా తిరిగి వస్తే అది అదృష్టమేనని చెప్పుకోవాలి. విజయ్‌ మాల్యా మీద ఇప్పడు మీడియా హడావుడి వల్ల ఉపయోగం లేదనీ, ఆయనను కూర్చోపెట్టి వీలైనంత సొమ్ముని రాబట్టుకోవాలని పారిశ్రామికవేత్త కిరణ్‌మజుందార్ షా చెప్పిన మాటలలో విచక్షణ లేకపోలేదు. కిరణ్‌మజుందార్‌ షా మరోమాట కూడా అన్నారు. విజయ్ మాల్యా జీవనశైలిని వల్ల మీడియా దృష్టి అతని మీద ఉందనీ... నిజానికి అంతకంటే ఎక్కువ సొమ్ములను దిగమింగిన బడాబాబులు, ప్రభుత్వ సంస్థలు చాలానే ఉన్నాయని షా అభిప్రాయపడ్డారు. ఉదా॥ ఎయిర్‌ ఇండియా మీద 43 వేల కోట్ల రూపాయల రుణభారం ఉందని షా పేర్కొన్నారు. అదే నిజమైతే అంతకంటే దురదృష్టం మరోటి ఉండదు. మాల్యాకంటే ప్రబుద్ధులెందరో ప్రజల కంట పడకుండా జల్సా చేసుకుంటున్న విషయాన్ని ఇకనైనా బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ పని ఎవరు చేస్తారు!
ఎ) సీబీఐ
బి) బ్యాంకులు
సి) ప్రభుత్వం
డి) ఎవ్వరూ కాదు!
ఈ ప్రశ్నకు సమాధానం అంత కష్టం కాదేమో!