భారత్‌ మాతాకీ జై... ఈ నినాదం ఇప్పుడిక వివాదం!

 

మార్చి 3: ఆరెస్సెస్‌ నేత మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ, ఇప్పటితరానికి ‘భారత్‌ మాతాకీ జై’ అనే నినాదాన్ని నేర్పాలని సూచించారు. జేఎన్‌యూలో తీవ్రవాది అఫ్జల్‌గురుకి అనుకూలంగా, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయన్న నేపథ్యంలో మోహన్‌ భగవత్‌ ఈ మాటని అన్నారు. మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలకు మజ్లిస్ నేత అసదుద్దీన్‌ స్పందించారు! తన పీక మీద కత్తి పెట్టినా సరే, తాను మోహన్ భగవత్‌ సూచించిన నినాదాన్ని చేయననీ, అలా చేయమని రాజ్యాంగంలో ఎక్కడా రాసి లేదని పేర్కొన్నారు. ‘నేను నినాదాన్ని చేయకపోతే నన్నేం చేస్తారు’ అంటూ నేరుగా మోహన్‌ భగవత్‌కు సవాలు విసిరారు. దీంతో దేశం మరో వివాదంలోకి జారుకుంది.

 

ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. వాటికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇతరులకు ఉంటుంది. కానీ కొన్ని వివాదాలని చూసీ చూడనట్ల ఊరుకునే అవకాశం దక్కకపోవచ్చు. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటి అని గట్టిగా అడిగితే ‘అవును’ లేదా ‘కాదు’ అని చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. మంచో చెడో, ఇప్పడు దేశంలో తరచూ ఇలాంటి వివాదాలే తలెత్తుతున్నాయి. మొదట అసహనానికి సంబంధించిన చర్చ, ఆ తరువాత జేఎన్‌యూ ఘటన... ఈ రెండూ చల్లారేసరికి ఇదిగో ఇప్పుడు భారత్‌ మాతకి సంబంధించిన వివాదం!

 

అసదుద్దీన్‌ మాటలను ఖండిస్తూ కొన్ని బలమైన నిరసనలు వినిపించాయి. పార్లమెంటు సాక్షిగా సాహిత్యకారుడు జావేద్‌ అక్తర్‌, అసదుద్దీన్‌ వ్యాఖ్యలను ఖండించారు. ఆయన ఏకంగా అసదుద్దీన్‌ను, హైదరాబాదుకి చెందిన వీధి నాయకునిగా అభివర్ణించారు. ఇటు అసదుద్దీన్‌ అనుచరులేమో ఆయన వ్యాఖ్యలకు తాము కూడా కట్టుబడి ఉన్నామంటూ ముందుకు వస్తున్నారు. నిన్నటికి నిన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ‘వారిస్‌ పఠాన్‌’ అనే శాసనసభ్యుడు ఇలాంటి ప్రయత్నమే చేసి, సభ నుంచి సస్పెండ్‌ అయ్యారు. రోజులు గడిచే కొద్దీ, ఇలాంటి వార్తలు ఇకమీదట వినిపిస్తూనే ఉండవచ్చు.

 

ఇంతకీ అసదుద్దీన్‌ ఆ నినాదం గురించి ఎందుకంతగా విరుచుకుపడినట్లు! ఒక దేశాన్ని దేవతగా భావించడం తన ధర్మం ప్రకారం సబబు కాదనో, ఒక నినాదం చేయనంత మాత్రాన ఎవరూ దేశద్రోహులు కారనో... తన మనసులో ఉన్న కారణాన్ని చెబితే సరిపోయేదేమో. కానీ ‘నేను నినదించను, ఏం చేస్తారో చేసుకోండి’ అనడంతో ఒక సవరణగా ఉండాల్సిన మాట కాస్తా సవాలుగా మారిపోయింది. హిందుత్వానికి ప్రతీక ఆరెస్సెస్‌ అయితే, ముస్లింల తరఫున ఆరెస్సెస్‌కు ప్రత్యామ్నాయం మజ్లిస్ అని అసదుద్దీన్ చెప్పినట్లైంది. అసదుద్దీన్‌గారు కోరుకున్నది ఇదేనా! దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్న మజ్లిస్ పార్టీకి ఇలాంటి వివాదాలు లాభించబోతున్నాయా!

 

ఒకే నినాదాన్ని అటు దేశభక్తితోనూ, ఇటు మతంతోనూ ముడిపెట్టడం వల్ల... భావోద్వేగాలు తీవ్రస్థాయికి చేరుకునే ప్రమాదం లేకపోలేదు. కొందరు బహుశా ఇదే కోరుకుంటున్నారేమో! ఆ కొందరిని పట్టించుకోకుండా, వారు చేసే ఉద్రేకపూరిత వ్యాఖ్యలకు స్పందించకుండా ఉండటమే మేలు. ఒక నినాదాన్ని చేయాలా వద్దా అనేది వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు వదిలివేయడమే మంచిది. లేకపోతే దేశాన్ని కలిపి ఉంచేందుకు నినదించి ‘భారత్‌ మాతాకీ జై’.... ఇప్పడు వైషమ్యాలను పెంచే ఆయుధంగా కొందరికి ఉపయోగపడుతుంది.