మధ్యాహ్నానికల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్ ఫలితాలు
posted on Aug 14, 2025 6:17AM

కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం (ఆగస్టు 14) వెలువడనున్నాయి. ఈ ఉప ఎన్నికలను తెలుగుదేశం, వైసీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సార్వత్రిక ఎన్నికలకు మించిన ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రచారం, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఓ రేంజ్ లో సాగాయి. ముఖ్యంగా పిలివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ సందర్భంగా యుద్ధవాతావరణం కనిపించింది. అయితే పోలింగ్ రోజునే వైసీపీ చేతులెత్తేసి ఓటమిని అంగీకరించేశామంటూ పరోక్షంగా అంగీకరించేసిందని పరిశీలకులు ఆ పార్టీ నేతల ప్రకటనలు, ఆరోపణలను ఉదహరిస్తూ విశ్లేషిస్తున్నారు. ఆఖరికి వైసీపీ అధినేత జగన్ కూడా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేయడంతోనే.. ఆ పార్టీ మానసికంగా ఓటమికి సిద్ధమైపోయిందని అవగతమైపోయందని అంటున్నారు.
ఏది ఏమైనా గురువారం (ఆగస్టు 14) ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నానికి ఫలితం వెలువడుతుంది. ఈ నేపథ్యంలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీస్థానాలలో గెలిచేదెవరు? ఓడేదెవరు? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా కేంద్రమైన కడపలో అన్ని ఏర్పాట్లూ చేశారు. కడపలోని పాలిటెక్నిక్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరగనుంది.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒకే రౌండ్ లో ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుంది. పులివెందులలో మొత్తం పది వేల 601 ఓట్లకు గాను 8 వేల 103 ఓట్లు పోలయ్యాయి.
ఇక ఒంటిమిట్ట విషయానికి వస్తే.. ఈ జడ్పీటీసీ స్థానం ఓట్ల లెక్కింపునకు కూడా పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఒంటిమిట్టలో మొత్తం 24 వేల 606 ఓట్లు ఉండగా, పోలైనవి 20 వేల 681.