తిరుమల గెస్ట్‌హౌస్ పేరిట ఫేక్ వెబ్‌సైట్లు..వాటిని నమ్మొద్దు : పోలీసులు
posted on Aug 13, 2025 9:48PM
.webp)
తిరుమలలో శ్రీవారి దర్శనం, వసతుల పేరిట ఇంటర్నెట్‌లో నకిలీ వెబ్‌సైట్లు పెరుగుతున్నాయి. వాటిని నివారించడానికి తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు తిరుమల పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. ఇప్పటి వరకు 28 నకిలీ వెబ్‌సైట్లను తొలగించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా శ్రీవారి దర్శనం, తిరుమలలో వసతులు కల్పిస్తామంటూ ఇంటర్నెట్‌లో 30కిపైగా నకిలీ వెబ్‌సైట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని సెర్చ్ ఇంజిన్ నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఇప్పటి వరకు 28 నకిలీ వెబ్‌సైట్లను తొలగించినట్లు పేర్కొన్నారు.
భక్తులు ఎవరైనా తిరుమలలో వసతుల కోసం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసినప్పుడు.. సప్తగిరి గెస్ట్‌హౌస్, నందకం గెస్ట్‌హౌస్, పద్మావతి గెస్ట్‌హౌస్.. ఇలా కొన్ని గెస్ట్‌హౌస్‌ల పేరుతో వెబ్‌సైట్లు కనిపిస్తే అవి నకిలీవిగా గుర్తించాలని పోలీసులు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం, వసతులు, సేవల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://www.tirumala.orgను మాత్రమే సందర్శించాలని చెప్పారు. వాట్సప్ కాల్, క్యూఆర్ కోడ్ పంపించి పేమెంట్ చేయాలని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దన్నారు. ఇలాంటివి అనుమానాస్పదంగా కనిపిస్తే దగ్గర్లోని పోలీస్‌స్టేషన్/100/టోల్ ఫ్రీ నంబర్ 18004254141ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.