చిరంజీవి నెత్తిన తిరుపతి భారం
posted on Mar 27, 2012 10:03AM
చిరంజీవి రాజ్యసభకు ఎన్నిక కావడంతో తిరుపతి అసెంబ్లీ సీటుకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. తాను ఖాళీ చేసిన ఈ సీటుని తన భార్య సురేఖతో భర్తీ చేయాలని చిరంజీచి మొదట భావించారు. అయితే దీనికి అధిష్టానం సుముఖంగా లేకపోవడంతో పార్టీ ఎవరికీ టిక్కెట్ ఇస్తే వారిని గెలిపించడానికి కృషి చేస్తానని చిరంజీవి మాట వరసకు అన్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా అభ్యర్థి ఎంపిక బాధ్యతను, అతన్ని గేలించుకునే కర్తవ్యాన్ని కూడా చిరంజీవికే అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం 18 శాసనసభ స్థానాల ఎంపిక గురించి మంత్రులతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రాథమిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తిరుపతి అభ్యర్థి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ భారం చిరంజీవికే వదిలేద్దామని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
దీంతో చిరంజీవికి తిరుపతి బరువు బాధ్యతలు మోయకతప్పేట్లు కనిపించడం లేదు. చిరంజీవికి ఈ బాధ్యతను అప్పగించడం ద్వారా కొంత బరువును దించుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ చిరంజీవి సూచించిన అభ్యర్థి ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ వైఫల్యం చిరంజీవిపై నెట్టివేసి ఆయన పరపతిని తగ్గించవచ్చు. ఒకవేళ చిరంజీవి సూచించిన అభ్యర్థి గెలిస్తే దానికి పెద్ద్డగా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉండదనేది కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహంగా తెలుస్తోంది. కానీ చిరంజీవి సన్నిహితులు ఈ అంశంపై మరోరకంగా ఆలోచిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక బాధ్యతను చిరంజీవికి అప్పగిస్తే ఆయన గల్లా జయదేవ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తనకు సుమారు రూ.8 కోట్ల వరకు ఎన్నికల వ్యయం అయిందని, ఆ డబ్బును తిరిగి తనకు అందజేసే షరతుతో ఆయన గల్లా జయదేవ్ పెద్రును ప్రతిపాదించవచ్చని తెలుస్తోంది. జయదేవ్ వల్ల గతంలో పెట్టిన ఖర్చులు తనకు తిరిగి వస్తే సరిపోతుందన్న భావనతో చిరంజీవి ఉన్నారు. జయదేవ్ గెలిస్తే ఆ క్రెడిట్ చిరంజీవికే దక్కుతుంది. ఒకవేళ ఓడిపోతే అది పార్టీ వైఫల్యంగా ప్రచారం చేయవచ్చని చిరంజీవి వర్గం భావిస్తున్నట్లు తెలుస్తుంది.