కాంగ్రెస్ వర్సెస్ ప్రజారాజ్యం పార్టీ మనుషులు కలిశారు కాని మనుసులు కలవడం లేదు
posted on Mar 26, 2012 5:35PM
కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యంపార్టీ విలీనం ఒక ప్రహాసనంగా మారింది. కేవలం పదవులకోసం పిఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారన్నఅపవాదును చిరంజీవి ఇప్పటికే మూటగట్టుకున్నారు. ఈ అపవాదుల మాట ఎలా ఉన్న కాంగ్రెస్ లో విలీనమయిన పిఆర్పి నేతలు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి, అనుమానాలతోనే ఉన్నారు. మనుషులమయితే కలుస్తున్నాం కాని, మా మనసులు మాత్రం కలవడం లేదని పిఆర్పి ఎమ్మెల్యే ఒకరు తెలుగువన్.కామ్ వద్ద వాపోయారు.
కాంగ్రెస్ పార్టీలో తాము ఎన్నటికి ద్వితీయ శ్రేణి నాయకులుగానే ఉండాల్సి వస్తుందని, పదవులు ముందుగా కాంగ్రెస్ పార్టీవారికి ఇచ్చిన తరువాతే ఏమైనా మిగిలితే తమకు అంటగడతారని ఆ శాసనసభ్యుడు నిర్వేదంగా చెప్పారు. అయితే కాంగ్రెస్ లో విలీనం తరువాత మంత్రి పదవిని తెచ్చుకున్న రామచంద్రయ్య మాత్రం పిసిసి అధ్యక్షుడి నుంచి సిఎం వరకూ ఎవరూ తమను లెక్కచేయడం లేదని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులెవరు తమతో సఖ్యతగా ఉండటం లేదని ఆయన వాపోయారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి కూడా ఇలానే ఉంది. విశాఖ కాంగ్రెస్ నాయకులు ఆయనను దూరంగా ఉంచడానికి లేదా తామే ఆయనకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రి ఒకరు గంటా శ్రీనివాసరావుపై ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. జిల్లాలో ఏం చేయాలన్నా గంటా శ్రీనివాసరావు ముందుగా తనతో సంప్రదించాలని ఆ మంత్రివర్యులు కోరుకుంటున్నారు. దీనికి గంటా నిరాకరించడంతో ఇద్దరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి.