సోనియాతో మనసులోమాట బయటపెట్టిన చిరు
posted on Dec 14, 2011 1:19PM
హైద
రాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత, ప్రస్తుత కాంగ్రెస్ నేత చిరంజీవి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వద్ద తన మనస్సులోని మాటను వెలుబుచ్చారు. కేంద్రమంత్రి పదవి చేపట్టేందుకు తనకు ఏమాత్రం ఇష్టం లేదని, తనను ఇంతవాడిని చేసిన ప్రజలకు అందుబాటులోనే ఉంటూ ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నట్టు తన మనస్సులోని మాటను వెల్లడించారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యంలో విలీనం కావడంతో కాంగ్రెస్ మరింత బలోపేతమైందని భావిస్తున్న తరుణంలో చిరంజీవి పెట్టిన సరికొత్త డిమాండ్‌తో జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కలకలం మొదలైనట్టు తెలుస్తోంది. చిరంజీవికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కల్గిన పాత్ర ఉంటుందని ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం గతంలో అనేక మార్లు బాహాటంగానే ప్రకటిస్తూ వచ్చింది. ఈ మేరకు త్వరలోనే ఆయనకు కేంద్ర కేబినెట్‌లో స్థానం కల్పించ వచ్చని జోరుగా కూడా ప్రచారం సాగింది. దీనికి బలం చేకూర్చేలా చిరంజీవి ఇటీవల అధినేత్రి సోనియా గాంధీతో కూడా భేటీ అయ్యారు. ఆ భేటీ సమయంలోనే చిరంజీవి తన మనస్సులోని మాటను వెల్లడించినట్టు సమాచారం. తాను కేంద్రంలో ఏ పదవులు కోరుకోవడం లేదని, రాష్ట్రంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని భావిస్తున్నట్లు బాంబు పేల్చారు. అందువల్ల తనకు రాష్ట్రంలోని తగిన ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే, చిరంజీవి తన మనస్సులోని మాటను ఈ విధంగా బయటకు చెప్పడంలో అంతరార్థం వేరే వుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన పావులు కదుపుతున్నట్టుగా వారు అభిప్రాయపడుతున్నారు.