త్యాగానికి తగిన గుర్తింపు.. పిఠాపురం వర్మ ఎదురు చూపులు ఫలించనున్నాయా?

ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా... ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి అంత భారీ మెజారిటీతో గెలిచారంటే అందుకుర  ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ చేసిన త్యాగం ఒక ప్రధాన కారణం. ఈ విషయంలో ఎటువంటి సందేహానికీ తావు లేదు.  అయితే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరిన తరువాత నియోజకవర్గంలో పరిస్థితి మారింది.  గత ఎన్నికలలో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తన పిఠాపురం సీటును త్యాగం చేసి, ఆయన విజయం కోసం కృషి చేసిన వర్మకు నియోజకవర్గంలో అవమానాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా జనసేనలో వైసీపీయుల చేరికలు వర్మకు  వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేశాయి.

గత ఎన్నికల సందర్భంగా వర్మ త్యాగానికి కచ్చితంగా తగిన గుర్తింపు ఇస్తాననీ, ఎమ్మెల్సీ పదవిని కట్టబుబతానని తెలుగుదేశం  అధినేత చంద్రబాబు  అప్పట్లో పిఠాపురం వర్మకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే.. అది ఇప్పటికీ కార్యరూపం  దాల్చ లేదు. అయినా వర్మ నమ్ముకున్న పార్టీని అంటిపెట్టుకుని, తన అసహనాన్నీ, అసంతృప్తినీ బయటపెట్టకుండా ఓపికగా ఎదురు చూశారు. మరో వైపు నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా జనసేన వైసీపీ వారిని పార్టీలోకి చేర్చుకుంటూ ఆయనను ఇబ్బందులకు గురి చేసినా ఓర్చుకున్నారు.  

ఆ ఓర్పుకు, సహనానికి ఇప్పుడు ప్రతిఫలం లభించనుందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. అతి త్వరలో పిఠాపురం వర్మకు కీలక పదవి లభించే అవకాశాలున్నాయని అంటున్నారు. వర్మకు తాజాగా ఇద్దరు గన్ మెన్ లను కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు తార్కానమంటున్నారు.   మూమూలుగా అయితే ఏదో ఒక చట్ట సభలో సభ్యుడిగా ఉన్నవారికి మాత్రమే గన్ మెన్లను కేటాయించడం  రివాజు. అలా కాకపోతే.. సంఘ విద్రోహక శక్తులు, అంటే నక్సలైట్లు, ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నవారికి గన్ మెన్లను కేటాయిస్తారు. కానీ అయితే పిఠాపురం వర్మ ప్రస్తుతం చట్టసభ  సభ్యుడు కారు. ఆయనకు నక్సలైట్లు, ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి లేదు. అయినా మాజీ ఎమ్మెల్యే పిఠాపురం వర్మకు ప్రభుత్వం ఇద్దరు గన్మెన్లను కేటాయించడం ఆయనకు త్వరలో కీలక పదవి దక్కబోతోందనడానికి తార్కానంగా చెబుతున్నారు పరిశీలకులు. ఆయనకు కేటాయించిన గన్ మెన్లు విధుల్లో చేరడం కూడా జరిగిపోయింది.

ఇప్పుడు తెలుగుదేశం వర్గాలు, వర్మ అభిమానులలో జరుగుతున్న చర్చ  ఏమిటంటే..  వర్మను ఎమ్మెల్సీగా చేసి చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడమే కాకుండా, కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇందుకు ఆధారంగా వారు ఇటీవల పిఠాపురం వర్మ ఉండవల్లిలో చంద్రబాబుతో భేటీ అయ్యారనీ, ఆ భేటీ తరువాతే ఆయనకు ప్రభుత్వం గన్ మెన్లను కేటాయించిందనీ అంటున్నారు. అలాగే పిఠాపురం వర్మ త్యాగానికి  తగిన గుర్తింపు, పదవి ఇవ్వాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా భావిస్తున్నారనీ అంటున్నారు.  చూడాలి మరి వర్మకు దక్కనున్న పదవి ఏమిటో?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu