ప్రకాశం బ్యారేజ్ కు ముప్పు తప్పదా?

విజయవాడ సమీపాన కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ కు ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ క్రింద ఉన్న మూడు అప్రాన్ లు చాలా కాలం క్రిందటే ధ్వంసం కావడంతో బ్యారేజ్ బాగా బలహీన పడింది. 2000 సంవత్సరంలో వచ్చిన భారీ వరదలకు రెండు ఆప్రాన్ లు, 2008లో మూడో ఆప్రాన్ దెబ్బతిన్నాయి. అయితే అప్పట్లో వీటికి తాత్కాలిక మరమ్మత్తులు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఆప్రాన్ ల స్థానం కొత్తగా నాలుగు ఆప్రాన్ లు నిర్మించాలని నిపుణులు సిఫార్సు చేసినప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి తోడు బ్యారేజ్ నిర్వహణకు ఇచ్చే నిధులను కూడా తగ్గించి వేయడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. గతంలో దీని నిర్వహణకు ఏడాదికి రెండు కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ ఏడాది 50 లక్షల రూపాయలు మాత్రమే కేటాయించింది. ఈ అరకొర నిధులతో బ్యారేజ్ నిర్వహణ కష్టసాధ్యమని సిబ్బంది అంటున్నారు. 2000 సంవత్సరంలో బ్యారేజ్ కు 11.05 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది, అప్పట్లో బ్యారేజ్ భద్రతపై భయాందోళనలు వ్యక్తమయ్యాయి. మరోసారి ఇదే స్థాయి వరదనీరు వచ్చి చేరితే బ్యారేజ్ దెబ్బతినడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బ్యారేజ్ పై భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు.

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu