పేదరికం తరిగి ఉపాధి పెరిగిపోతోంది..ట!
posted on Apr 28, 2025 4:57PM

ప్రపంచ బ్యాంకు ఉవాచ
దేశంలో పేదరికం ఏ స్థాయిలో వుందో, ఆకలి స్థాయి ఏమిటో, కటిక దారిద్ర్యంలో మగ్గుతున్న పేదలకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. కానీ ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక మాత్రం భారత దేశంలో పేదరికం రోజురోజుకూ తగ్గిపోతోందని అంటోంది. ఆర్థిక పేదరికం మాత్రమే కాకుండా, విద్య, ఆరోగ్యం జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న వివిధ కోణాల పేదరికంలో కుడా కూడా భారత దేశం మంచి మెరుగుదల సాధించిందని నివేదిక పేర్కొంది. అలాగే.. ఉపాధి కల్పనలోనూ భారత దేశం ముందుకు దుసుకుపోతోందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక లెక్కలు కట్టి మరీ తేల్చి చెప్పింది.
అవును. గడచిన దశాబ్ద కాలంలో భారత దేశంలో 17.10 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్టు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 2011-12లో దేశ జనాభాలో 16.2 శాతం ప్రజలు దుర్భర పేదరికం (రోజుకు రూ.200 కంటే తక్కువ ఆదాయం)లోమగ్గగా, 2022-23 నాటికి ఆ సంఖ్య 2.3 శాతానికి తగ్గినట్టు ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. దుర్భర పేదరికంతో బాధపడుతున్నవారు పదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 18.4 శాతం నుంచి 2.8 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 10.7 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరం 7.7 నుంచి 1.7 శాతానికి తగ్గింది. పేదలు క్రమేణా దిగువ, మధ్య-ఆదాయ కేటగిరీలోకి మారుతున్నారు. అలాగే దిగువ, మధ్య-ఆదాయ కేటగిరిలో ఉన్నవారు మధ్య తరగతి ఆదాయ కేటగిరిలోకి వెళ్తున్నారు.
ఇక గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 69 శాతం నుంచి 32.5 శాతానికి, పట్టణాల్లో 43.5 శాతం నుంచి 17.2 శాతానికి తగ్గింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరం 25 నుంచి 15 శాతానికి తగ్గింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనలో భారత్ పురోగతి సాధిస్తోందని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. 2021-22 నుంచి యువత (శ్రామిక-వయసు జనాభా) కంటే వేగంగా ఉపాధి పెరుగుతోందని వెల్లడించింది. ముఖ్యంగా మహిళలు, గ్రామీణుల్లో స్వయం ఉపాధి పెరుగుతోందని తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పట్టణ నిరుద్యోగం 6.6 శాతానికి తగ్గిందని, 2017-18 నుంచి ఇదే అతి తక్కువ అని వెల్లడించింది. ఉపాధి కోసం గ్రామీణ పురుషులు పెద్ద సంఖ్యలో పట్టణాల బాట పడుతున్నారని తెలిపింది. వ్యవసాయ రంగంలో గ్రామీణ మహిళల ఉపాధి మెరుగుపడినట్టు పేర్కొంది. దేశంలో మహిళల ఉపాధి రేటు 31 శాతానికి చేరినట్టు వెల్లడించింది.
అయితే,ఉపాధి విషయంలో మహిళలు మెరుగుపడినప్పటికీ, వారిపై అసమానతలు మాత్రం తగ్గలేదని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. మహిళా ఉద్యోగ రేటు 31 శాతానికి చేరుకుందని, కానీ వేతన ఉద్యోగాల్లో మహిళల కంటే పురుషులు 234 మిలియన్లు ఎక్కువగా ఉన్నారని పేర్కొంది. అలాగే దేశంలో ఉన్న పేదరికాన్ని కూడా నివేదికలో ప్రపంచ బ్యాంకు ప్రస్తావించింది. అలాగే, 2011-12లో ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 60శాతంగా ఉన్న పేదల, 2022-23 నాటికి 54 శాతానికి తగ్గారని, అని వరల్డ్ బ్యాంకు పేర్కొంది. అయితే,ఇప్పటికి కూడా పేదరికంలో పెద్ద పీట ఈ ఐదు రాష్ట్రాలదే’అని కూడా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది.
అయితే ఈ నివేదిక అక్షర సత్యమా అంటే కాదు. నిజానికి ప్రపంచ బ్యాంకు నివేదిక అనే కాదు, ప్రపంచంలోని ఏ సంస్థ ఇచ్చే నివేదిక అయినా సంపూర్ణ సత్యం కాదు. సంపూర్ణ అసత్యం కాదు. కొంత సత్యం. కొంత అసత్యం. అయితే.. ఇతర దేశాలతో పోల్చి నప్పుడు, ముఖ్యంగా కొవిడ్ అనంతర కాలంలో, మన దేశం ఆర్థిక పరిస్థితి ఎంతో కొంత మెరుగ్గా ఉందని ప్రపంచ దేశాలు అన్నీ అంగీకరిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడవ స్థానికి చేరుకుంటుందని అంటున్నారు. అలాగే.. గడచిన పదేళ్ళలో 25 కోట్ల మందికి పైగా పేదలు, పేదరికం గీత దాటి పై మెట్టుకు చేరుకున్నారని, కేంద్ర విత్త మంత్రి నిల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే.. మరో వంక విపక్షాలు మాత్రం దేశంలో పేదరికం, నిరుద్యోగం పోటాపోటీగా పెరిగి పోతున్నాయని అంటున్నారు. అందుకే.. మజ్ను అందాలను చూడాలంటే లైలా కళ్లతో చూడాలి అంటారు.