రాజంపేట  జైలులో పోసాని... మార్చి 13 వరకు రిమాండ్ 

సినీ నటుడు,రచయిత పోసాని కృష్ణ మురళికి రైల్వేకోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.  పోలీసులు ఆయనను రాజంపేట స‌బ్ జైలుకు త‌ర‌లించారు. ఆయ‌నను క‌స్ట‌డీకి కోరుతూ శుక్రవారం  పోలీసులు పిటిష‌న్ దాఖ‌లు చేసే అవ‌కాశం ఉంది.  పోసానిపై ఇప్ప‌టికే రాష్ట్ర‌వ్యాప్తంగా 14 కేసులు న‌మోదయ్యాయి.  పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు బుధ‌వారం నాడు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.  అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ సమక్షంలో  పోలీసులు  దాదాపు  9 గంట‌ల పాటు విచారించారు. అనంతరం  రాత్రి జ‌డ్జి ముందు హాజ‌రుప‌రిచారు. రాత్రి 9.30 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు సుదీర్ఘంగా వాద‌న‌లు కొనసాగాయి. అనంత‌రం ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ రైల్వే కోడూరు కోర్టు  జడ్జి తీర్పు చెప్పారు . దీంతో పోసాని  వచ్చే నెల   అంటే మార్చి 13 వరకు రిమాండ్ లో ఉంటారు. చంద్రబాబు, పవన్‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు.. కులాల పేరుతో దూషించినట్లు పోసానిపై జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఇదే కేసు విషయంలో పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.  హైద్రాబాద్ రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి   అరెస్ట్ చేస్తున్నట్లు.. కుటుంబ సభ్యులకు చెప్పారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణ మురళిపై  గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోసానిపై  బిఎన్ఎస్ సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేసినట్లు నోటీసుల్లో తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్  ఛైర్మన్‌గా పనిచేసిన పోసాని నోటికిచ్చానట్లు  విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తోపాటు మంత్రి నారా లోకేష్‌ను అసభ్యకరంగా దూషించారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోసానిపై కేసులు నమోదయ్యాయి. దీంతో పోసాని అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. తాజాగా కోర్టు ఆయనకు మార్చి 13 వరకు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu