వైసీపీలో మినీ మేనిఫెస్టో మహా ప్రకంపనలు

అవును. తెలుగు దేశం పార్టీ మహానాడులో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన, 2024 ఎన్నికల ముందస్తు మినీ  మేనిఫెస్టో అనేక మందిని ఆశ్చర్యపరిచింది. తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఆర్థిక సంస్కరణలకు పెట్టింది పేరుగా నిలిచారు. ఆర్థిక, విద్యుత్ సంస్కరణలకు పెద్దపీట వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు తెచ్చిన సంస్కరణల ఫలితంగానే, తెలుగు రాష్టాలకు, ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని  హైదరాబాద్  నగరానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఐటీ, ఫార్మా  హబ్ గా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇది ఎవరో అన్న మాట కాదు  స్వయంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, కేటీఆర్ ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సత్యం. నిజం. చంద్రబాబు శ్రీకారం చుట్టిన సంస్కరణలే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఇంధనంగా  మారి ముందుకు నడిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా ప్రపంచం గుర్తిస్తోంది. 

అవును. అప్పుడు అలా సంస్కరణలకు పెద్ద పీట వేసిన చంద్రబాబు నాయుడు, మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత వరాలు సహజంగానే, కొన్ని ప్రశ్నలను తెర మీదకు తెచ్చాయి. అలాగే, వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరిట అమలు చేస్తున్న ఉచిత పథకాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయని విమర్శిస్తున్న తెలుగు దేశం పార్టీ,  ఉచిత పథకాలను, మినీ మేనిఫెస్టోలో, గ్యారెంటీలుగా చూపడం ఏమిటనే ప్రశ్నతో పాటుగా, మరి కొన్ని ప్రశ్నలు విమర్శలువినిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో తో కలవర పాటుకు గురైన వైసీపీ మంత్రులు, మాజీలు మినీ మేనిఫెస్టో పై విమర్శలు గుప్పిస్తున్నారు. గతాన్ని తవ్వి తీసి, ప్రజలు తెలుగు దేశం పార్టీని, ఆ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను నమ్మరని సంబర పడిపోతున్నారు.జగన్ రెడ్డికి  ఉన్న ‘గొప్ప’ విశ్వసనీయత చంద్రబాబాబుకు లేదని తమలో తాము సంబుర పడిపోతున్నారు. 

అయితే  అధికార వైసీపీ చేస్తున్న పసలేని రాజకీయ విమర్శలను పక్కన పెడితే, తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు సంస్కరణలకు పెద్ద పీట వేసింది నిజం. అలాగే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం పేరిట అమలు చేస్తున్న ఉచిత పథకాలను విమర్శించిందీ నిజమే. కానీ  తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు పేదలకు పనికొచ్చే, సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు. నిజానికి  ఈరోజు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశ వ్యాప్తంగా అమలవుతున్న సబ్సిడీ బియ్యం (రూపాయికి కిలో బిబియ్యం) పథకానికి శ్రీకారం చుట్టింది తెలుగు దేశం పార్టీ... అలాగే ఈ రోజున తెలుగు రాష్త్రాలు సహా వివిధ రాష్ట్రాల్లో అమలువుతున్న ఉచిత విద్యుత్, మహిళా సాధికరిత కోసం చేపట్టిన  అనేక సంక్షేమ పథకాలకు  గతంలో  తెలుగు దేశం ప్రభుత్వాలే శ్రీకారం చుట్టాయి.  అంతే కాదు, తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమాలను సమాంతరంగా ముందుకు తీసుకుపోతే, వైసీపీ  జగన్ రెడ్డి అభివృద్ధిని పక్కకు నెట్టి ఆర్థిక ప్రగతిని పట్టాలు తప్పించారు.

సంతుల్యత లోపించి రాష్ట ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది. అప్పుల కుప్పగా మారిపోయింది. అప్పు పుడితే తప్ప పూట గడవని పరిస్థితిలోకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జారిపోయింది. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అయినా ఇవ్వలేనంతగా రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజారిపోయింది. అదలా ఉంటే  వైసీపీ ప్రభుత్వం  ఓ వంక  సంక్షేమం పేరిట ప్రజలను మభ్య పెట్టి ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ, మరో వంక మద్యం ధరలు మొదలు విద్యుత్, బస్సు చార్జీలను ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోయింది. జనం నడ్డి విరిచింది.  చివరాఖరుకు చెత్తమీదా పన్నేసింది. ఈ  చేత్తో ఇచ్చి ఆ చేత్తో అంతకు పదింతలు గుజుకుంది. ఆలా గుంజుకున్న సొమ్ములను అవినీతి ఖాతాలో వేసుకుని నేతలు ఆస్తులు పెంచుకున్నారు. రాష్టాన్ని అప్పుల ఊబిలోకి, జనాలను మద్యం మత్తులోకి  వైసీపీ సర్కార్ నెట్టి వేసింది..నిజానికి తెలుగు దేశం తప్పు పట్టింది, వైసీపీ ప్రభుత్వం సక్షేమం చాటున సాగిస్తున్న అవినీతి బాగోతాన్నే కాని, సంక్షేమ పథకాలను కాదు.

అయితే  వైసేపీ నేతలు తెలుగు దేశం మినీ మేనిఫెస్టో ను విమర్శిస్తున్నారు. చంద్రబాబు, తమ నాయకుడు జగన్ రెడ్డిని ఫాలో అవుతున్నారని సంబర పడి పోతున్నారు. కానీ  ప్రజలు సంక్షేమం, సంక్షోభం మధ్య ఉన్న సన్నని  పొరను గుర్తిస్తున్నారు. జగన్ రెడ్డి కుట్రలను గ్రహించారు. అందుకే  చంద్రబాబు మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలకు మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నారు. అందుకే వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. గోల చేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా, చంద్రబాబు నాయుడు తమ అనుభవం అంతా రంగరించి సంధించిన మినీ మేనిఫెస్టో ... వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.