ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదం.. రాజకీయ యుద్ధం
posted on Mar 1, 2025 5:04AM

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ (ఎస్ఎల్‌బీసీ) ప్రమాదం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రమాదానికి కారణం మీరంటే.. మీరంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 8:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో ఎనిమిది మంది లోపలే చిక్కుకుపోయారు. వారిని ఎలాగైనా ప్రాణాలతో బయటికి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనింగ్ బృందాలతోపాటు.. రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి టన్నెల్ లో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. వారం రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో భాగంగా.. శుక్రవారం(ఫిబ్రవరి 28) టీబీఎం మిషన్‌ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్‌తో కట్ చేశారు. దీంతో.. టన్నెల్‌లోని బురద, శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా.. గ్రౌండ్ పెనిట్రెటింగ్ రాడర్ టెక్నాలజీతో కార్మికుల జాడ కోసం టన్నెల్‌లో స్కానింగ్ నిర్వహించారు. తద్వారా ఎట్టకేలకు బురదలో కూరుకుపోయిన మృతదేహాల జాడను గుర్తించారు.
టన్నెల్ కూలిన ప్రదేశంలో ఐదు ప్రాంతాల్లో మెత్తటి భాగాలు గుర్తించారు. టన్నెల్ లో మూడు మీటర్ల లోతు బురదలో వీరి మృతదేహాలను గుర్తించారు. అత్యాధునిక పరికరాలు, రాడార్ల సాయంతో మృతదేహాలను గుర్తించడం జరిగింది. మృతదేహాల గుర్తింపులో ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం కీలక పాత్ర పోషించింది. మృతి చెందిన వారిలో ఇద్దరు ఇంజినీర్లు కాగా, ఆరుగురు కార్మికులు. టన్నెల్ లో చిక్కుకున్న అందరూ మరణించారని నిర్ధారణ కావడంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. అయితే.. మృతదేహాలు ఉన్నట్లు గుర్తించిన ప్రాంతంలోనే తవ్వకాలు జరిపి మృతదేహాలను బయటికి తీసుకువచ్చేలా రెస్క్యూ సిబ్బంది చర్యలు చేపట్టారు. అయితే, తవ్విన తర్వాత మానవ దేహాలా.. కాదా అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ తాజాగా వార్తలపై కీలక ప్రకటన చేశారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని.. తప్పుడు వార్తలను ఎవరూ నమ్మొద్దు.. మృతదేహాల గురించి ఏదైనా సమాచారం లభిస్తే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో ప్రమాద ఘటన బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ప్రమాదానికి కారణం మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రమాదం తర్వాత మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్'లో స్పందించారు. 'ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు ఒక డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు'' అని ఆయన ట్వీట్ చేశారు. నిపుణుల అనుమతి తీసుకోకుండా ప్రభుత్వం ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించిందని, నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటుచేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేటీఆర్, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం బాధ్యతను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టన్నెల్ నిర్మాణంలో లీకేజీల ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. సమస్యకు పరిష్కారం చెప్పడానికి బదులుగా, అసంబద్ధమైన రాజకీయ విమర్శలు చేస్తున్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో ప్రజెంటేషన్‌లో భాగంగా ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు గురించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. టన్నెల్ గురించి, టన్నెల్ బోరింగ్ మెషీన్ గురించి, టన్నెల్ తవ్వకంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడారు. ఎప్పట్నుంచి వింటున్నాం ఈ ఎస్ఎల్‌బీసీ... ఎన్నేళ్లకు కంప్లీట్ కావాలి..? ఇది ఎవరి పాపం? ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి..? అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. టన్నెల్ బోరింగ్ మెషీన్ బోరింగ్ చేసుకుంటూ వెనుక లైనింగ్ చేసుకుంటూ పోతుంది. దాన్ని వెనక్కి తీసుకువచ్చి కొత్త పద్ధతిలో పెడదామా.. అంటే వెనక్కి తీసుకురాలేం. అప్పటివరకు చేసుకున్న లైనింగ్ అంతా కూలగొట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన ప్రాజెక్టు ఎస్ఎల్‌బీసీ అని కేసీఆర్ అన్నారు.
ఇదిలాఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరాబాదరగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ చేపట్టడంతోనే కుప్పకూలిందని హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో బిజీగా ఉన్నారు.. మంత్రులేమో పొద్దున్నే వస్తారు.. సాయంత్రానికి వెళ్తున్నారు. ఘటన జరిగి ఇన్నిరోజులై కార్మికులు చిక్కుకున్నా.. వారిని సురక్షితంగా తీసుకురావాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉందా..? అంటూ ప్రశ్నించారు. హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఎందుకు ఎస్ఎల్‌బీసీని పెండింగ్ పెట్టింది..? ఎందుకు 200 లోమీటర్లు టన్నెల్ తవ్వి మిగతాది వదిలేశారు..? తక్కువ లాభం వస్తుందనా..? అంటూ ప్రశ్నించారు. ఇదిలాఉంటే.. టన్నెల్లో ప్రమాదం జరిగి ఎనిమిది మంది చిక్కుకుపోతే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తున్నది.