ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. చంద్రబాబు విజన్ కే కమలం మద్దతు

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు , రాజకీయ సమీకరణాలు వేగంగా మరి పోతున్నాయా? కొత్త కొత్త మార్పులు  చోటుచేసుకుంటున్నాయా?  కొత్త పొత్తులకు బాటలు పడుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అధికార వైసీపీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  సక్షేమం అంటూ  ‘మీటదే’ భారం అన్నవిధంగా  ముందుకు సాగుతున్నారు.  ముఖ్యమంత్రి జగన్   ఒక చేత్తో మీటలు నొక్కుతూ మరో చేత్తో రాష్ట్ర అభివృద్ధి పీక నొక్కుతున్నారని ఈ  అయితే మూడున్నరేళ్ల  పాలనలో రాష్ట్ర ప్రజలు  గ్రహించారు.  

ముఖ్యమంత్రి అలోచనలు, అంచనాలు, విధానాలతో సొంత పార్టీ నేతలే విభేదిస్తున్నారు. మరో వంక ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం జగన్  ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధాలను ఎండగడుతూ జనంలోకి దూసుకు పోతోంది, మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ ప్రజాందోళనలలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు చేసిన పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలాగే బాదుడే బాదుడు కార్యక్రమాలకూ జనం పోటెత్తారు. తాజాగా ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అంటూ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటనకు జనం సునామీలా కదిలి వచ్చారు.  

ఇక బీజేపీ విషయానికి వస్తే నిజానికి రాష్ట్రంలో బీజేపీకి కనీసం ఉనికిని చాటుకునే పాటి  బలం కూడా  లేదు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి ఎంతో కొంత ప్రాధాన్యత ఉందంటే అందుకు  కారణం ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి ఉన్న బలం కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ కు లేని గుర్తింపు గౌరవం బీజేపీకి దక్కుతున్నాయి. అయితే, బీజేపీ జాతీయ నాయకత్వం రాష్టంలో పాగా వేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక ఇతరత్రా అవసరాల దృష్ట్యా ఇంతవరకు వైసీపీతో బీజేపీ రహస్య ప్రేమను చూపించింది. ఆ విధంగా,ఇంతవరకు జగన్ రెడ్డి ప్రభుత్వం గండాల నుంచి బయటపడుతూ వచ్చిందనేది కాదనలేని నిజం. అయితే ఇప్పుడు ఇక జనం మూడ్ గ్రహించిన బీజేపీ వైసీపీకి అండగా నిలిచేందుకు సిద్ధంగా లేదని అర్ధమౌతోంది.

మరో వంక రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పతాక స్థాయికి చేరుకుంది. ఈ అన్నిటినీ మించి ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అనుభవం అవసరమనే విషయాన్ని జనం గుర్తించారు. ఏ రాజకీయ పార్టీ అయినా, నాయకుడైనా సరే జనం అభీష్ఠం మేరకు నడుచుకుంటేనే భవిష్యత్.ఈ విషయాన్ని బీజేపీ గుర్తించింది. అందుకే ఇప్పుడు ఆ పార్టీ కూడా రాష్ట్రంలో ఆధిపత్యం అన్నది పక్కన పెట్టి ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి ఉనికినైనా కాపాడుకుంటే చాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ నేపధ్యంలో, రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా రాజకీయ పునరేకీకరణ జరుగుతోంది. అది అనివార్యం కూడా.

అందుకే బీజేపీ జాతీయ నాయకత్వం   రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా, చంద్రబాబు ‘విజన్’ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే నిర్ణయానికి రావడమే కాకుండా.. రాష్ట్రంలో కనీస రాజకీయ ప్రాతినిథ్యమైనా ఉండాలంటే సైకిల్ తో జతకట్టడమే మేలన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే చంద్రబాబుకు హస్తిన నుంచి వరుస ఆహ్వానాలు. అలాగే, ఇంత కాలం రాజధాని విషయంలో జోక్యం చేసుకోని బీజేపీ (జోక్యం చేసుకోకపోవడం సరే.. రాజధాని రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అంటూ చెబుతూ వచ్చింది కమలం పార్టీ) ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల  ఆలోచనకు వ్యతిరకంగా ప్రత్యక్ష కార్యాచరణకు  దిగింది.  రాష్ట్ర బీజేపీ అమరావతి పాదయాత్ర, జగన్ రెడ్డి ప్రభుత్వ ఆర్థిక తప్పిదాలపై విమర్శల వర్షం ఈ కోవలోకే వస్తుంది.  బీజేపీలో వచ్చిన ఈ మార్పే రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతంగా చెప్పవచ్చు.