పాయె.. అయిపాయె.. సొంత రాష్ట్రంలోనే ఎవరికీ పట్టని పీకే!

బీహార్ పరిణామాల నేపథ్యంలో తాజాగా మళ్లీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ తెరపైకి వచ్చారు. ఎన్నికల వ్యూహకర్తగా ఓ వెలుగు వెలిగిన పీకే.. రాజకీయ నేతగా మాత్రం ఎవరికీ పట్టకుండా పోయారు. ఇప్పుడు ఇటు ఎన్నికల వ్యూహాలూ పారక.. అటు రాజకీయంగానూ గుర్తింపు లేక రెంటికీ చెడ్డ రేవడగా మిగిలిపోయారు. బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం కుప్ప కూలి మహాఘట్ బంధన్ సర్కార్ కొలువుదీరిన పరిణామాలలో ప్రశాంత్ కిశోర్ ప్రమేయమే లేకుండా పోయింది.

నితీష్ వ్యూహాలను పసిగట్టడంలో పీకే టోటల్ గా జీరో అయ్యారు. బీహార్ పరిణామాలు 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీయేతర పక్షాల ఐక్యతకు నాందిగా పరిశీలకులు విశ్లేషిస్తున్న వేళ ఎవరూ అడగకుండానే.. నితీష్ కు అంత సీన్ లేదంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో నెటిజెన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. బీహార్ లో బీజేపీకి షాకిస్తూ.. కొత్త మిత్రులతో చేరి బిహార్ లో  కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ వ్యూహ చతురతపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విశ్లేషణలు వస్తున్నాయి. దాదాపు అన్ని విశ్లేషణలూ ఈ పరిణామం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీకి చేదు అనుబవాన్ని మిగిల్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే చెప్పాయి.

బీజేపీకి మిత్రపక్షాలన్నీ దూరం కావడం వచ్చే సార్వత్రిక ఎన్నికలు మోడీ హ్యాట్రిక్ ఆశలకు గండి కొడతాయనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  అయితే ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ విశ్లేషణలను కొట్టి పారేస్తూ.. నితీష్ కు అంత సీన్ లేదని వ్యాఖ్యనించారు.  బీహార్ పరిణామాలు జాతీయ స్థాయిలో రాజకీయాలను ఇసుమంతైనా ప్రభావితం చేయవని తేల్చేశారు. కేవలం నితీష్ స్వార్థం వల్లనే బీహార్ పరిణామాలు సంభవించాయని సూత్రీకరించారు. అంతే కాకుండా నితీష్ వ్యూహాలపై, వ్యవహార శైలిపై విమర్శలు చేశారు.

గత పదేళ్లుగా ఆయన బీహార్ లో చేస్తున్న రాజకీయ ప్రయోగాలన్నీ కుప్పిగంతులేనని ప్రశాంత్ కిషోర్ అభివర్ణించారు. గత పదేళ్లుగా తాను ముఖ్యమంత్రిగా కొనసాగడమే లక్ష్యంగా ఇలాంటి రాజకీయ జంపిగ్ లను ఆయన గతంలో ఐదు సార్లు చేశానపీ, ఇది ఆరోసారనీ విమర్శించారు. కేవలం సీఎంగా కొనసాగడమే లక్ష్యంగా ఆయన తీరు ఉందనీ, ఆయన వల్ల బీహార్ కు జరిగిన మేలేమీ లేదని విమర్శించారు. ఏ విషయంలోనూ సైద్ధాంతిక సారూప్యత లేని జేడీయూ, ఆర్జీడీలు కలిసి బీహార్ ను ఏం చేస్తారోనని భయంగా ఉందని పీకే వ్యాఖ్యానించారు.  అయితే పీకే వ్యాఖ్యలను పరిశీలకులు కొట్టి పారేస్తున్నారు. నితీష్ పై ఉన్న వ్యక్తిగత వైరానికి తోడు తెలంగాణ ముఖ్యమంత్రిపై ఉన్న వ్యక్తిగత ప్రేమ కూడా పీకే వ్యాఖ్యలకు కారణమని విశ్లేషిస్తున్నారు.

పీకే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణ సీఎంను జాతీయ నేతగా నిలబెట్టే పనిని అంగీకరించారనీ, ఆ దిశగా ఆయన టీమ్ తెలంగాణలో పని చేస్తున్నదనీ, ఈ పరిస్థితుల్లో మోడీకి వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే బలమైన నేతగా నితీష్ ఆవిర్బవిస్తే తెలంగాణ తనకు ఇచ్చిన ఉద్యోగం కోల్పోతుందన్న భయంతోనే బీహార్ పరిణామాలు జాతీయస్థాయిలో చూపే ప్రభావం ఏమీ ఉండదంటూ విశ్లేషణలు చేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. అదీ కాక మోడీ వ్యతిరేకతను పూర్తిగా తగ్గించుకుని మరీ పీకే మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.