వైఎస్ విజయమ్మకు తృటిలో తప్పిన పెను ప్రమాదం


ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి, వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చరైంది. ఆయితే ఈ ప్రమాదంలో విజయమ్మ సురక్షితంగా బయట పడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. దాదాపుగా ఇటువంటి ప్రమాదంలోనే ఇటీవల నలుగురు మరణించిన సంగతి తెలిసిందే.

దీంతో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చరైందనగానే అందరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదం నుంచి విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారని తెలియగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం విజయమ్మకు వైసీపీతో ఎటువంటి సంబంధాలూ లేవు. ఆమె పూర్తిగా తెలంగాణకే పరిమితమయ్యారు.

ఆమె కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల వెఎస్సార్ తెలంగాణ పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైఎస్ సతీమణిగా విజయమ్మకు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గౌరవం, మర్యాదా ఉన్నాయి. అందుకే ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందనగానే ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఉలిక్కి పడ్డాయి. ఆమె క్షేమంగా బయటపడ్డారని తెలియగానే ఊపిరి పీల్చుకున్నాయి.  వైఎస్ స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.