రైతుకి నేల‌ కానుక‌!

ఓ పిల్ల‌వాడు చ‌క్రాన్ని క‌ర్ర‌తో నెమ్మ‌దిగా కొడుతూ అలా బండాట ఆడుతూంటాడు. ఇది మ‌న‌లో చాలా మంది బాల్యంలో ఆడ‌టాన్ని గుర్తుచేస్తుంది. అలా వెళుతూన్న‌వాడికి పూర్వం అయితే ప‌ది పైస‌లు బిళ్ల క‌న‌ప‌డ‌గానే అమాంతం ఆగి దాన్ని తీసి చొక్కోకో, నిక్క‌రుకో తుడిచి జేబులో ప‌డేసుకుంటాడు. ఇక వాడికి లోకంలో మ‌రేమీ అక్క‌ర్లేనంత ఆనందం. అమాంతం ఇంటికి వెళ్లి త‌ల్లికి చూపిస్తాడు. ఆమె ఏమ‌న్న‌దో విన కుండా గ‌ల్లీ చివ‌ర్లో దుకాణానికి వెళ్లి తోచిన‌ది కొని తింటాడు. ప‌ది పైస‌ల ఆనంద‌మే అంతుంటే ఏకంగా వ‌జ్ర‌మే దొరికితే!  త‌ప్ప‌కుండా ఊళ్లో భూస్వామి నా ముందు బ‌లాదూర్ అనే అను కుంటాడు. 

ఇటీవ‌ల క‌ర్నూలు జిల్లా జి.ఎర్ర‌గుడి గ్రామానికి చెందిన ఓ రైతు పొలాని వెళ్లాడు. రోజూ వెళ్లిన‌ట్టే అదే దారంటా వెళ్లాడు. ఈ ఏడు వ‌ర్షాల భీభ‌త్సంతో పంట‌లు స‌రిగా పండుతాయా, త‌న పిల్ల‌ల చ‌దువు, ఇత‌ర ఖర్చుల సంగ‌తేమిటీ.. ఇలాంటి ఆలోచ‌న‌లు ముసురుకున్నాయి. అలానే క‌ర్ర‌పోటు వేసుకుంటూ ముం దుకు వెళ్లా డు. అంత‌లో రెండ‌డుగుల దూరంలో ఏదో మెరిసిన‌ట్ట‌యింది. మెల్ల‌గా వెళ్లి ప‌ట్టి పైకి తీసాడు. అర‌చేతిలో పెట్టి ప‌రిశీల‌న‌గా చూశాడు. అది మామూలు రాయి కాదు ఏకంగా వ‌జ్ర‌మే.. ప‌ది క్యారెట్ల‌ది. 

ఈ సంగ‌తి తెలుసుకున్న పెర‌వ‌లి, జొన్న‌గిరి ప్రాంతాల‌కు చెందిన కొంద‌రు వ్యాపారులు దాన్ని ఎంతైనా డ‌బ్బు పెట్టి  కొనేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. స‌దరు రైతు ఇంటి ముందు ఊరు ప్ర‌జ‌లు, కాస్తంత ధ‌నికు లూ క్యూక‌ట్టారు. ఇవేమీ తెలియ‌ని ప‌క్క పొలంవాడు.. బావా!.. ఏంజెసినా..ఇంత‌మంది ప‌డ్డారు? అని అడిగాడే గాని త‌న స్నేహితుడి జాతకం మారింద‌ని తెలిసి ఎంతో సంతోషించాడు. 

చిత్ర‌మేమంటే, ఏటా తొలకరి వర్షాల తర్వాత జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, తుగ్గలి ప్రాంతాల్లోని పొలాల్లో వజ్రాలు లభించడం సాధారణమేనని స్థానికులు చెబుతున్నారు. అది సాదాసీదా రైతుకి చిక్కిం ది గ‌నుక రూ.50 ల‌క్ష‌ల‌కు అమ్ముడు పోయింది. ఎప్ప‌డూ ఇంత సొమ్ము చూడ‌ని ఆ రైతు దేవుడు ఉన్నాడ‌ని అనుకున్నాడు.