పినిపే పేదవాడే, అబ్బాయి మాత్రం చాలా రిచ్
posted on Sep 17, 2012 3:03PM
మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి తప్పతాగి కారు తోలుతూ పోలీసులకు చిక్కాడు. మంత్రిగారబ్బాయి తోలుతున్న కారుని చూస్తే ఆయనగారి జోరెంతో స్పష్టంగా తెలుస్తోందని అంతా ముక్కున వేలేసుకున్నారు. మంత్రిగారబ్బాయ్ కదా... ఆ మాత్రం దర్పం ఉండాల్లే అని కొంతమంది అనుకున్నారు.
ఎన్నికల అఫిడవిట్ లో మంత్రి పినేపే విశ్వరూప్ చూపించిన మొత్తం ఆస్తుల విలువ దాదాపు కోటీ 13 లక్షల 80 వేల రూపాయలు. అఫిడవిట్ చెబుతున్న లెక్కల ప్రకారం అబ్బాయిగారి పేరుమీద ఓ ఎల్లైసీ పాలసీతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సెక్రటరియేట్ బ్రాంచ్ లో ఓ వెహికల్ లోన్ కూడా ఉంది. అంతా బాగానే ఉంది కానీ.. మంత్రిగారబ్బాయ్ పేరుమీద ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవని అఫిడవిట్ లో చూపించారు.
సార్.. ఆస్తుల మొత్తం విలువ దగ్గర దగ్గరగా కోటి రూపాయలు మాత్రమే ఉంది. కానీ.. మంత్రి గారబ్బాయ్ మాత్రం లేటెస్ట్ బ్రాండ్ మోడల్ వోల్వో కారులో తిరుగుతున్నారు. ఇంత తక్కువ ఆస్తులున్న మంత్రిగారు, అబ్బాయికి 35 లక్షల విలువచేసే కాస్ట్లీ కారుని కొనిచ్చారా, లేక వెహికల్ లోన్ కింద చూపిస్తున్న డబ్బుతోనే అంత ఖరీదైన కారుని కొన్నారా.. లేక.. చూపించిన ఆస్తులు మాత్రమే కాక లోపల్లోపల ఇంకా చాలా ఆస్తులూ గట్రా ఉన్నాయా..? అని చాలామందికి అనుమానం కలుగుతోంది.
ఒక వేళ లోన్ తీసుకుని అంత ఖరీదైన కారుని కొనుక్కున్నట్టైతే ఇంత తక్కువ ఆస్తులతో, అస్సలు సంపాదనే లేని, ఆస్తి పాస్తుల్లేని అబ్బాయిగారు (అఫిడవిట్ లో చూపించిన దాని ప్రకారం) ఆ లోన్ ఎలా తీర్చగలరో ఏమో అన్న సందేహం కూడా సామాన్యులకు కలుగుతోంది. ప్రజా సంక్షేమంకోసం అహరహం పాటుపడుతున్న మంత్రిగారి భుజాలమీద.. ప్రజలకు ఈ విషయంలో కలుగుతున్న కొత్త కొత్త అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యతకూడా ఉందని నలుగురూ గట్టిగానే అనుకుంటున్నారు.
ఎన్నికల అఫిడవిట్ లో పినిపే చూపించిన ఆస్తుల వివరాలు