పెట్టుబడి పేరుతో మొత్తం కాజేస్తారు
posted on Sep 17, 2012 12:00PM


రిటైల్‌రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో భారీగా నిరసనలు ప్రతిధ్వనిస్తున్నాయి. యుపిఎలోని మిత్ర పక్షాలు సైతం ప్రతిపక్షాలతో పాటు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. తృణముల్ దీనిపై 72 గంటల్లో పునరాలోచించుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చింది. రిటైల్‌రంగంలో ఎఫ్‌డిఐని అనుమతించడం భారత విఫణి, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపి, భారత ఆర్థికవ్యవస్థను దెబ్బతీస్తుందనీ, రిటైల్ వ్యాపారులు, రైతులు ఆర్థికంగా దెబ్బతింటారని ఎస్‌పి అధికార ప్రతినిధి రాజేంద్రచౌదరి వ్యాఖ్యానించారు. ఇలా అన్ని పక్షాలు దీనిపై ముక్తకంఠంతో విమర్శలు సంధిస్తున్నాయి. ఈ పెట్టుబడులను స్వాగతిస్తే.. భవిష్యత్‌లో మీ ఇంటికి, పొలానికి కొన్న సిమెంట్, ఇటుకలు, ఎరువులు మా పెట్టుబడితోనే కొన్నారు కనుక అది కూడా మాదే’ అని కూడా అనేసి ఆక్రమించేస్తాయి ఆ పెట్టుబడి భూతాలు. గతంలో విదేశీయులను నమ్మి వందల సంవత్సరాలు మోసపోయిన చరిత్రను పాలకులు మరచిపోయినా.. ప్రజలు మరచిపోలేదు. ఇలా ప్రతిరంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ పోతే ప్రభుత్వానికి అవసరమైన సలహా, సహకారాలు, దేశానికి కావలసిన పెట్టుబడులు అందిస్తున్నాం కాబట్టి ఇది మాదే అని కూడా అనేస్తారు. మన పాలకుల తీరు కోతికి కొబ్బరి దొరికిన చందంగా ఉంటే ఈ పెట్టుబడుల మిషతో వచ్చేవారంతా ‘తాము శెనగలు తింటూ అవి ఉలవలని చెప్పి పత్తివిత్తులు చేతిలో పెట్టే’ వారే. దీని ప్రతిఘటించకపోతే భవిష్యత్ భారతంలో మరో స్వాతంత్య్ర సమరం పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.