కన్నప్పా.. పిలక- గిలక వివాదమేంటి!?
posted on Jun 9, 2025 1:08PM

మోహన్ బాబు బేసిగ్గా చిత్తూరు వాసి. ఆయన శ్రీ విద్యానికేతన్ సైతం ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానాలతో పాటు వాటి ఉప ఆలయాలు వెరసీ.. ఈ ప్రాంతంలో బ్రాహ్మణ ఆధిపత్యం కానీ ఈ సామాజిక వర్గం పట్ల గౌరవాభిమానాలు గానీ ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఒకింత ఎక్కువగానే ఉంటాయ్. తిరుమలలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఇంతటి ప్రపంచ ప్రఖ్యాతమైందంటే అందుకు కారణం ఈ బ్రాహ్మణుల నిష్టాగరిష్టతలే కారణం అన్న భావనతో ఒకింత గౌరవం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ.. ఈ ప్రాంతంలో తాను పుట్టడం మాత్రమే కాకుండా, ఇక్కడే తన విద్యా వ్యవస్థను సైతం స్థాపించి, ఇంకా ఈ ప్రాంతంతో తన అనుబంధం పెంచుకుంటూ వస్తున్నారు మోహన్ బాబు. అంటే ఈ ప్రాంత నమ్మకాలపై ఆయనకుగానీ ఆయన కుటుంబానికి గానీ ఈ సామాజిక వర్గంపై ఒక మర్యాద ఉండే ఉంటుంది. కానీ ఇందుకు రివర్స్ లో వెళ్తోంది మోహన్ బాబు ఫ్యామిలీ. దేనికైనా రెడీ విషయంలోనూ సరిగ్గా ఇలాంటి వ్యవహారమే నడిచింది. అప్పట్లో అదో పెద్ద గొడవ. ఫిలింనగర్ లో ఆయన నివాసం ముందు ఆందోళనలూ నడిచాయి.
తాజాగా కన్నప్ప లో పిలక- గిలక వ్యవహారం మరో సారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ సినిమాలో పిలక- గిలక అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్ కన్నప్ప. మొన్నటికి మొన్న శివరాత్రి సమయంలో సాక్షాత్ ఆ శ్రీకాళహస్తీశ్వరుడి ముందు నిబంధనలకు విరుద్ధంగా టీజర్ రిలీజ్ చేశారన్నది ఒక వివాదం కాగా.. హార్డ్ డిస్కులు పోయాన్నది మరో వివాదం. తాజాగా ఈ పిలక- గిలక పోస్టర్ కలకలం. ఈ పిలక- గిలక పాత్రల ద్వారా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అవహేళన చేశారంటూ ఆ సమాజికవర్గాల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కన్నప్ప సినిమాలో ఉద్దేశ పూర్వకంగానే ఈ పాత్రలను పెట్టారని బ్రాహ్మణ సంఘాలు విరుచుకుపడుతున్నాయి. ఇది బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బ తీయడంతో సమానమన్నది అంటున్నాయి. దీంతో కన్నప్ప ప్రీ- రిలీజ్ ఈవెంట్ ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి.
నిజానికి కన్నప్ప అనే పాత సినిమాని బట్టి చూస్తే కాళహస్తీశ్వర ఆలయ పూజారి (రావుగోపాలరావు పోషించిన పాత్ర) కన్నప్పను నిజంగానే ఇబ్బందుల పాలు చేసినట్టు కనిపిస్తుంది. మరి అప్పుడిదే బ్రాహ్మణ సంఘాలు ఎందుకింతగా వ్యతిరేకించలేదన్నది ఒక వాదన కాగా.. రెండోది ఏంటంటే మోహన్ బాబు కుటుంబానికి బ్రాహ్మణులతో పెట్టుకుంటే బాగా కలిసి వస్తుందన్నది మరో కామెంట్ గా తెలుస్తోంది.
ఇప్పటికే కన్నప్ప బడ్జెట్ 100 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. పాన్ ఇండియా లెవల్ స్టార్స్ ఇందులో ఉన్నా.. అంతా టాక్ ని బట్టే రికవరీ అవుతుంది. అందుకంటూ ఒక బూస్టింగ్ అవసరం. అలా జరగాలంటే సినిమా ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండాలి. ఇప్పటికే చాలా చాలా ట్రై చేసిన మంచు వారి బృందం.. తాజాగా బ్రాహ్మణులకు సంబంధించిన వివాదాల తుట్టె కూడా కదిపినట్లు కనిపిస్తోంది. దీంతో తమ సినిమా డెఫినెట్ గా వార్తల్లో ఉండటమే కాక.. ప్రేక్షక జనం దృష్టిని సైతం ఆకర్షించడం ఖాయ మన్నట్టుగా.. భావిస్తున్నారు. మరి చూడాలి ఏమౌతుందో?