మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టులో పిల్
posted on Jan 30, 2025 2:25PM
.webp)
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో బుధవారం (జనవరి 29) తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించిన ఘటనపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనకు ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ సర్కారే బాధ్యత వహించాలంటూ విశాల్ తివారీ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భవిష్యత్ లో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ప్రొసిడ్యురల్ గైడ్ లైన్స్ జారీ చేయాలని ఆయన తన పిటిషన్ లో సుప్రీం కోర్టును కోరారు. అంతే కాదు భక్తుల భ్రదత ప్రమాదంలో పడకుండా వీఐపీల కదలికలను నియంత్రించాలని కోరారు.
ఈ పిటిషన్ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై యూపీ సర్కార్ స్టేటస్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేలాలో జనవరి 29 వరకూ 27 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. కుంభమేళా ముగింపు దశకు వచ్చే క్రమంలో భక్తుల తాకిడి మరింత పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. మొత్తం మీద కుంభమేళా 70 కోట్ల మంది వరకూ భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది.
ఇలా ఉండగా తొక్కిసలాట ఘటన తరువాత అలర్ట్ అయిన యోగి ఆదిత్యనాథ్ సర్కార్ భక్తుల భద్రత మెరుగుపరచడం కోసం కొన్ని చర్యలు చేపట్టింది. వీవీఐపీలకు పాసులు రద్దు చేసింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించింది. మౌని అమావాస్య నాడు స్నానమాచరించలేని భక్తులు వసంత పంచమి నాడు స్నానమాచరించాలన్న అఖాడా పిలుపు నేపథ్యంలో ఫిబ్రవరి 3 అంటే వసంత పంచమి రోజున, అలాగే మాఘ పౌర్ణమి అయిన ఫిబ్రవరి 12న, ఇక మహా కుంభ మేళా ముగింపు రోజైన ఫిబ్రవరి 26, ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం కూడా కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారన్న అంచనాతో యోగి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.