రామాంజనేయ యుద్ధం!

 

 

ఎప్పుడో రామాయణంలో రామాంజనేయ యుద్ధం జరిగిందని చదువుకున్నాం. ఇప్పుడు తెలంగాణాయణంలో కూడా మరో రామాంజనేయ యుద్ధం జరుగుతోంది. ఆ రామాంజనేయులు ఎవరో కాదు.. మాజీ పోలీసు ఉన్నతాధికారులు. రాముడేమో పేర్వారం రాములు.. ఆంజనేయుడేమో ఆంజనేయరెడ్డి!
 

పేర్వారం రాములేమో అర్జెంటుగా తెలంగాణ వచ్చేయాలని అంటూ వుంటే, ఆంజనేయరెడ్డేమో తెలంగాణ వస్తే తెలుగుజాతి నష్టపోతుందని అంటున్నారు. తెలంగాణ ఏర్పడితే రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితి మీద ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సమావేశం సందర్భంగా వీరిద్దరి పేర్లు ఒకేసారి వార్తల్లోకి వచ్చాయి. సదరు సమావేశానికి ఆంజనేయరెడ్డిని ఆహ్వానించిన కేంద్రం పేర్వారం రాములుని ఆహ్వానించలేదని టీఆర్ఎస్ హడావిడి చేసింది. అప్పుడు వీరిద్దరి మధ్య పరోక్షంగా యుద్ధం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టుల ప్రాబల్యం పెరిగే అవకాశం వుందని, అది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీసే అవకాశం వుందని ఆంజనేయరెడ్డి ఇటీవల ఒక  సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మావోయిస్టులకు అడ్డాగా మారే ప్రమాదం వుందని ఆయన హెచ్చరించారు.  ఆంజనేయరెడ్డి ఇలా మాట్లాడారో లేదో టీఆర్ఎస్ నాయకత్వం పేర్వారం రాముల్ని అర్జెంటుగా యుద్ధంలోకి దించింది. యుద్ధంలోకి దిగిన పేర్వారం రాములు ఆంజనేయరెడ్డి మీద విమర్శనాస్త్రాలు సంధించారు.

 
అసలు నక్సల్ సమస్య పుట్టింది తెలంగాణ కాదని, సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులే తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం బలపడటానికి కారణమయ్యారని ఎదురుదాడి చేశారు.  మొత్తమ్మీద ఇద్దరు సీనియర్ పోలీసు అధికారుల మధ్య మాటల యుద్ధం ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ యుద్ధం భవిష్యత్తులో ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

 

Video Courtesy Tv9

Online Jyotish
Tone Academy
KidsOne Telugu