భజన సంఘంలో విజయశాంతి!

 

 

 

తెలంగాణ సీఎం కావాలని కలలు కంటున్నవాళ్ళంతా ఎవరికి వాళ్ళు ముమ్మరంగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. సీమాంధ్రులను తిట్టిపోయడం, సోనియాగాంధీని ఆకాశానికెత్తేయడం ద్వారా ఇటు తెలంగాణ ప్రజల అభిమానం, అటు సోనియాగాంధీ అనుగ్రహం పొందాలని ప్రయత్నిస్తున్నారు. జైపాల్‌రెడ్డి దగ్గర్నుంచి షబ్బీర్ అలీ వరకూ ఎవరి ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. తెలంగాణ వస్తుందో రాదో తెలియదు గానీ వీళ్ళ హడావిడి మాత్రం బాగా ఎక్కువైపోయింది.

 

రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్న సోనియాగాంధీని సీమాంధ్రులెవరైనా కడుపుమండి విమర్శిస్తే టీ కాంగ్రెస్ నాయకులు విరుచుకుపడిపోతున్నారు. సోనియాగాంధీని ఎవరేమన్నా సహించేది లేదంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఆ స్టేట్‌మెంట్లు ప్రింటయిన పేపర్ కటింగ్స్, టీవీలో టెలీకాస్ట్ అయిన వీడియో క్లిప్పింగ్స్ ఢిల్లీ పెద్దలకు పంపుతున్నారు. సోనియాగాంధీ అంటే తమకెంత అభిమానం వుందో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సర్లే.. పదవికోసం ఎవరి తంటాలు వారివి!



ఇప్పుడు ఈ తంటాలు పడేవాళ్ళ లిస్టులో అభినయ రాములమ్మ విజయశాంతి కూడా చేరింది. మొన్నటి వరకూ మెదక్ పార్లమెంట్ సీటు మీదే మమకారాన్ని పెంచుకున్న విజయశాంతి, ఆ సీటు కోసం టీఆర్ఎస్‌కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరింది. ఇప్పుడు ఆమె మనసు మెదక్ సీటు మీద నుంచి సీఎం సీటు మీదకి మళ్ళినట్టుంది. అందుకే, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఎంతమాత్రం తీసిపోని విధంగా సోనియాగాంధీ భజన మొదలుపెట్టింది.


మెదక్ నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి సోనియా వ్యతిరేకుల మీద విరుచుకుపడింది. తెలంగాణ ఇచ్చిన దేవతని కొంతమంది రాష్ట్ర మంత్రులు విమర్శిస్తున్నారని, అలాంటి వారిని క్షమించకూడదని ఉపన్యాసం ఇచ్చింది. సదరు ఉపన్యాసం ఇచ్చే సమయంలో  విజయశాంతి గారి హావభావాలు, ఆవేశం చూసిన వారికి విజయశాంతి ఎంత గొప్ప నటి అన్న విషయంలో ప్రత్యక్ష్యానుభవం కలిగి తరించిపోయారు. విజయశాంతి కూడా తెలంగాణ సీఎం పదవికి గాలం వేస్తోందన్న విషయం అర్థమైపోయి పులకరించిపోయారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu