పేర్ని నాని కుటుంబం తప్పించుకున్నట్లేనా?
posted on Dec 24, 2024 8:47AM

కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై గత కొద్దికాలంగా కేసులు, వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేషన్ గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కావడంపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బియ్యం మాయమైన కేసులో ప్రధాన నిందితురాలు జయసుధ విదేశాలకు వెళ్లిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశామని, అదే సమయంలో వారిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పేర్ని జయసుధ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ విచారణ మంగళవారం (డిసెంబర్ 24)కువాయిదా పడింది. మరోవైపు పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టులు పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పేందుకు పోలీసులు వారింటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ఈనెల 22న స్టేషన్ కు రావాల్సిందిగా ఇంటికి నోటీసులు అంటించారు. అయితే, వారు విచారణకు హాజరు కాకపోగా.. పోలీసుల నోటీసులు క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వారి పిటిషన్లపై కూడా మంగళవారం (డిసెంబర్ 24) కోర్టులో విచారణ జరగనుంది.
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పొట్లపాలెంలో గోదాములు నిర్మించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత ఏపీ గిడ్డంగుల సంస్థ ద్వారా పౌరసరఫరాల సంస్థ ఆ గోదాములను అద్దెకు తీసుకుంది. బస్తాకు నెలకు ఐదు రూపాయలు అద్దె చెల్లిస్తోంది. ఆ గోదాముల్లోని నిల్వల్లో తేడాలున్నట్లు గత నెల చివరి వారంలో పౌరసరఫరాల సంస్థకు ఫిర్యాదు రావడంతో వారు డిసెంబర్ నెల మొదటి వారంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో ప్రభుత్వానికి చెందిన రేషన్ బియ్యంలో 185 టన్నులు మాయమైనట్లు కృష్ణా జిల్లా సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. దీంతో రేషన్ బియ్యం మాయంపై బందరు పోలీస్ స్టేషన్ లో అధికారులు పేర్ని నాని సతీమణి, గోదాం యాజమాని జయసుధతోపాటు ఆమె వ్యక్తిగత కార్యదర్శిపైనా ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 10వ తేదీ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాక రూ.1.76కోట్లు జరిమానా విధించారు. షార్జేజీకి సంబంధించిన రేషన్ బియ్యం విలువ ప్రభుత్వానికి చెల్లిస్తామని నాని కుటుంబం పేర్కొంది. ఆ మొత్తాన్ని పౌరసరఫరాల శాఖకు చెల్లించినట్లు తెలిసింది. అయితే, డబ్బులు చెల్లించినా.. ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగంపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పేర్ని నానికి సంబంధించిన గోదాంలో రేషన్ బియ్యం మాయంపై పోలీసులు కేసు నమోదు చేసిన నాటి నుంచి ప్రధాన నిందితురాలు జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. వీరు ముందస్తుగా పారిపోవడానికి కొందరు పోలీసులు, కృష్ణా జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం నేతలు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఈ విషయంపై సీఎం చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారని ప్రచారం జరిగింది. మరోవైపు పేర్నినాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లడంపై వైసీపీ శ్రేణుల్లో నిరాశ వ్యక్తమవుతున్నది. గతంలో వైసీపీ హయాంలో కేసులు నమోదైన సమయంలో తెలుగుదేశం నేతలు దైర్యంగా ఎదుర్కొన్నారని.. ప్రస్తుతం వైసీపీ నేతలు కేసులు నమోదు కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోతుండటం పట్ల వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే.. ఈ కేసుల నుంచి పేర్ని నాని కుటుంబం సేఫ్ గా బయటపడేందుకు వైసీపీ నేతల కంటే కొందరు తెలుగుదేశం వారే క్కువ ఉత్సాహం చూపుతున్నారన్న వాదన టీడీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. పోలీసులు సైతం వారిని జాడ తెలిసినప్పటికీ పట్టుకొని స్టేషన్ కు తీసుకొచ్చి విచారణ జరిపేందుకు వెనుకడుగు వేస్తున్నారన్న వాదన కూడా ఉంది.
పోలీసుల నోటీసులు క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో నాని, ఆయన కుమారుడు కిట్టు పిటిషన్లు వేయగా.. కేసులో ఏ1గా ఉన్న నాని సతీమణి జయసుధ ఇప్పటికే బెయిల్ కోసం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై మంగళవారం (డిసెంబర్ 24) కోర్టుల్లో విచారణ జరగనుంది. కోర్టులు వారికి అనుకూలంగా తీర్పు ఇస్తే .. ఇక వారు అరెస్టు నుంచి తప్పించుకున్నట్లేనని అంటున్నారు. వైసీపీ హయాంలో తప్పు చేయకపోయినా అక్రమ కేసులు పెట్టి పోలీసులు తెలుగుదేశం నేతలను జైళ్లకు పంపించిన సందర్భాలు, పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చితకబాదిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో మాత్రం అందుకు విరుద్ధంగా తప్పు చేసినా కూడా వైసీపీ నేతలను అరెస్టు చేయకుండా వారు తప్పించుకునేందుకు అవకాశాలు ఇస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతికి పాల్పడినట్లు వైసీపీ నేతలు అడ్డంగా దొరికి, కేసులు నమోదైనా వారిని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టడంలో పోలీసులు విఫలమవుతుండటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.