ఏబీవీకి ఊరట మాత్రమే.. పూర్తి న్యాయమేదీ?!
posted on Dec 24, 2024 8:31AM
.webp)
వైసీపీ హయాంలో జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం నేతలపై కక్షపూరితంగా వ్యవహరించారు. అక్రమ కేసులు పెట్టి వారిని జైళ్లకు పంపించి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అదే తరహాలో కొందరు సీనియర్ అధికారులను కూడా జగన్ ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. ఈ జాబితాలో ప్రముఖంగా వినిపించే పేరు మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు తనకు వ్యతిరేకంగా పనిచేశారని జగన్ కక్ష కట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన్ను టార్గెట్ చేశారు. అయితే, ఏబీవీ సైతం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఐదేళ్లు యూనిఫాం వేసుకోకుండానే జగన్ ప్రభుత్వంపై న్యాయస్థానాల ద్వారా వీరోచిత పోరాటం చేశాడు. ఈ క్రమంలో ఒకానొక దశలో జగన్ రెడ్డి ధన బలం, అధికార బలం ముందు ఏబీవీ నిలవలేక పోయాడు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం అడ్డగోలుగా జగన్ ప్రభుత్వం ధిక్కరించింది. ఆయన మళ్లీ పోలీస్ డ్రస్ వేసుకోకుండా చేయడానికి లాయర్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. తన కుమారుడి కంపెనీ నుంచి పరికరాల కొనుగోలు చేశారన్న అభియోగంతో ఏబీవీని సస్పెండ్ చేసిన జగన్ సర్కారు.. ఆ అభియోగాలను రుజువు చేయలేక పోయింది. ఒకే కేసులో రెండుసార్లు ఏబీవీని సస్పెండ్ చేసి కక్షపూరితంగా వ్యవహరించింది. చివరకు క్యాట్‌లో సైతం ఏబీవీపై ఆరోపణలను జగన్ సర్కార్ రుజువు చేయలేకపోయింది. దీంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలన్న క్యాట్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆయన రిటైర్‌మెంట్ రోజున పోస్టింగ్ ఇచ్చింది. సుదీర్ఘకాలం తరువాత ఉదయం పోలీసు డ్రస్ వేసుకొని సాయంత్రం రిటైర్ కావాల్సిన పరిస్థితిని ఏబీ వెంకటేశ్వరరావు ఎదుర్కొన్నారు.
ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించడానికి వారిద్దరి మధ్య ఆస్తి తగాదాలు లేవు. ఆయన గత చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఏబీవీ తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించారన్న అపోహతోనే జగన్ ఆయనపై కక్ష పెట్టుకున్నారు. అందరిలా జగన్‌తో సర్దుకుపోయి ఉంటే ఏబీ భవిష్యత్ మరోలా ఉండేదన్నది వైసీపీ నేతల వాదన. కానీ ఏబీవీ మాత్రం జగన్‌కు తలొగ్గకుండా న్యాయస్థానాల ద్వారా సుదీర్ఘ పోరాటం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏబీ వెంటేశ్వరరావుకు ప్రభుత్వంలో కీలక పదవి అప్పగిస్తారని ప్రచారం జరిగింది. ప్రభుత్వ సలహాదారుగా ఆయన్ను నియమిస్తారని, ఇక వైసీపీ హయాంలో వైసీపీ కార్యకర్తల్లా పనిచేసిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలు తలకిందులయ్యయి. తెలుగుదేశం కోసం జగన్‌కు టార్గెట్ గా మారి ఐదేళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్న ఏబీవీకి కూటమి ప్రభుత్వం అధికారలోకి వచ్చిన తరువాత ఆశించిన స్థాయిలో న్యాయం జరగలేదన్న వాదన తెలుగుదేశం శ్రేణుల నుంచే వ్యక్తమవుతున్నది. తాజాగా ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ ప్రభుత్వం నమోదు చేసిన అన్ని కేసులనూ ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి జగన్‌పై ఐదేళ్లు అలుపెరగని పోరాటం చేసిన పోలీసు పోరాట యోధుడు ఏబీకి ఇది స్వల్ప ఊరట మాత్రమే అని చెప్పాలి. పూర్తి న్యాయం మాత్రం ఇంకా జరగలేదని అంతా భావిస్తున్నారు.
2019లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆయనకు సహకరించిన అధికారులకు చకచకా కీలక పదవులు అప్పగించారు. తెలుగుదేశంకుఫేవర్ గా ఉంటూ వచ్చిన అధికారులు ఐదేళ్ల జగన్ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చి ఆర్నెళ్లు అయినా వారికి ఇప్పటికీ సరైన న్యాయం జరగడం లేదన్న వాదన ఉంది. ఏవీ వెంకటేశ్వరరావు కూడా అదే జాబితాలో ఉన్నారు. ప్రధానంగా ఏసీబీ విచారణను ఉపసంహరించుకునేలా, అడ్వకేట్ జనరల్ చొరవ తీసుకుంటారని చాలామంది భావించారు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత గానీ ఆ ఫైలులో కదలిక రాకపోవడమే విచిత్రం. దానికంటే ముందు.. ఏబీవీని రెండోసారి సస్పెండ్ చేసేందుకు కారణమయిన కేసును కూడా ప్రభుత్వం వేగంగా ఉపసంహరించుకుంటుందని పార్టీ నాయకులు అంచనా వేశారు. ఇక్కడ మరో విషాదకర విషయం ఏమిటంటే.. కూటమి అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటినప్పటికీ ఏబీవీకి న్యాయంగా ప్రభుత్వం నుంచి రావలసిన కోటీ 70 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికీ రాలేదు. దాని కోసం ఆయన సీఎస్‌కు ఇచ్చిన లేఖ ఏటుపోయిందో మరి..! అంటే.. మంచి ప్రభుత్వంలో అధికారులు ఎంత సమర్ధవంతంగా పనిచేస్తున్నారో, ఎంత చురుకుగా పనిచేస్తున్నారో అర్ధమవుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అధికారుల బదిలీల్లో ఏబీవీ వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ఆరోపణలను ఆయన ఎదుర్కోవాల్సి వస్తున్నది. కూటమి ప్రభుత్వంలో ఆయనకు పూర్తి న్యాయం జరక్కపోగా.. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇదిలాఉంటే.. ఏబీవీపై జగన్ ప్రభుత్వం నమోదు చేసిన అన్ని కేసులూ ఉపసంహరించుకున్నట్లు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అప్పటి విచారాణాధికారి సిసోడియా వ్యవహారశైలి మరోసారి చర్చకు వచ్చింది. ఏబీవీపై విచారణకు జగన్ సర్కారు సిసోడియాను విచారణాధికారిగా నియమించింది. ఆ సందర్భంలో సిసోడియా ఏబీపై అడ్డగోలుగా నివేదిక ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాతనే సిసోడియాను గవర్నర్ కార్యదర్శిగా నియమించారని తెలుగుదేశం వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అయితే, ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణకు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇప్పించిన కారణంగానే సిసోడియాను తప్పించారే తప్ప ఆయనేమీ జగన్ బాధితుడు కాదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు అదే సిసోడియా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నారని, ఆయనకే సీఎస్ పదవి దక్కుతుందన్న ప్రచారంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.
తాజాగా ప్రభుత్వం ఏబీవీపై అన్ని కేసులు ఉపసంహరించుకున్న ఉత్తర్వు పరిశీలిస్తే సిసోడియా నివేదిక డొల్లతనం ఏమిటో స్పష్టమవుతోందని ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అలాంటి నివేదికలిచ్చిన సిసోడియాను సీఎస్‌గా నియమించి చంద్రబాబు ప్రభుత్వం అప్రతిష్ఠ ఎందుకు కొనితెచ్చుకుంటుందన్న వ్యాఖ్యలు అధికార వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.