విశాఖ నుంచి అరకుకు ప్రత్యేక రైలు
posted on Dec 24, 2024 9:04AM

శీతాకాలంలో అరకుకు పర్యాటకులు పోటెత్తుతారు. ప్రకృతి అందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు అరకులోయకు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం నుంచి అరకుకు ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ ప్రత్యేక రైలు ఈ నెల 28 నుంచి జనవరి 19 వరకూ ప్రతి శని ఆదివారాలలో నడుస్తుందని వాల్తేర్ సీనియర్ డీసీఎం తెలిపారు.
ఈ స్పెషల్ ట్రైన్ ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయలుదేరి 11.45 గంటలకు అరకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2 గంటలకు అరకు నుంచి బయలు దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ రైలులో ఒక సెకండ్ ఏసీ, ఒక థర్డ్ ఏసీ బోగీలతో పాటు 10 స్లీపర్ క్లాస్, నాలుగు జనరల్ బోగీలతో పాటు ఒక జనరల్ కమ్ లగేజ్ బోగీ ఉంటుంది. ఈ రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్.కోట, బొర్రా గుహలు మీదుగా రాకపోకలు సాగిస్తుంది. పర్యాటకులకు ఉపయుక్తంగా ఉండే విధంగా విశాఖ నుంచి అరకుకు ప్రత్యేక రైలు నడపడానికి రైల్వేశాఖ నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.