అజ్ఞాతంలోకి పేర్ని నాని.. హైకోర్టులో మాజీ మంత్రికి చుక్కెదురు

కృష్ణా జిల్లా పామర్రులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని రప్పా రప్పా అంటూ కొట్టిన డైలాగులు ఆయన్ని మరో కేసుల ఉచ్చులో బిగుసుకునేలా చేశాయి. ఓ కల్యాణ మండపంలో  జులై 8న జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రప్పా రప్పా అని చెప్పడం కాదు.. కన్ను కొడితే రాత్రికి రాత్రి చేసేయాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. లోకేష్‌ రెడ్ బుక్ అంటున్నాడు.. మీరు కూడా రప్పా.. రప్పా అంటున్నారు.. ఏదైనా పని చేయాలంటే చీకట్లో కన్నుకొడితే పని అయిపోవాలని పేర్నినాని వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. పని చేయాలంటే అనవసరమైన మాటలు...అల్లరి కాదని... పనిచేయడమే ముఖ్యమని హింసను ప్రేరేపించేలా వైసీపీ క్యాడర్‌ను ఉద్దేశించి పేర్ని నాని వ్యాఖ్యానించడం పొలిటికల్‌ హీట్‌ను పెంచేశాయి.

ఆ క్రమంలో పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదైంది. ఆర్‌.పేట పీఎస్‌లో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. పామర్రు మీటింగ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో కేసు నమోదు చేశారు.  కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లోనూ పేర్ని నానిపై కేసు నమోదైంది. పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర నేత కనపర్తి శ్రీనివాసరావు  అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 గుడివాడలో వైసీపీ నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యఅతిధిగా హాజరైన పేర్నినానికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వరుసగా రెండు రోజుల నుంచి పేర్ని నాని చేస్తున్న వివాదాస్పద కామెంట్స్‌పై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలకు నిరసనగా వైసీసీ ఫ్లెక్సీలను చించి వేశారు. వైసీపీ అధ్యక్షుడు జగనే రప్పరప్ప డైలాగులో తప్పు లేదనడంతో.. మనం మాత్రం ఎందుకు తగ్గాలన్నట్టు పేర్ని నాని వంటి నేతలు తమ శ్రేణులను మరింత రెచ్చగెట్టేలా స్టేట్ మెంట్లు ఇస్తుండటంపై ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వరుసగా నమోదవుతున్న కేసులతో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పేర్నినాని ప్రయత్నించారు. అయితే, హైకోర్టు పేర్ని నాని విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. అరెస్టు నుంచి ముందస్తు రక్షణ దక్కకపోవడంతో కంగుతిన్న పేర్ని నాని సైలెంట్‌గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.  పేర్ని నాని ఈనెల 22న హైకోర్టు విచారణ తరువాత బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu