తెలంగాణలో ముందస్తు ఎన్నికలు?
posted on Aug 5, 2023 3:40PM

తెలంగాణలో షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరగనున్నాయా? అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. వాస్తవంగా డిసెంబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మాత్రం అక్టోబర్ మొదటి వారంలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని పక్కాగా చెబుతున్నారు. తనను కలిసిన పార్టీ నేతల వద్ద ఆయన ఇదే విషయాన్ని చెబుతూ.. క్షేత్ర స్థాయిలో ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకుని పని మొదలు పెట్టేయాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ మరో సారి అధికారంలోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్వయంగా కేటీఆర్ పలు సందర్భాలలో చెప్పారు. ఆయన పార్టీ శ్రేణులు, నేతలే కాదు.. టీఆర్ఎస్ శ్రేణులు కూడా ముఖ్యమంత్రి పగ్గాలు అందుకునేది, అందుకోబోయేది కేటీఆర్ అనే అంటున్నారు. అదే విశ్వసిస్తున్నారు కూడా. అందుకు తగ్గట్టుగానే బీఆర్ఎస్ రాజకీయం మొత్తం ఇప్పడు కేటీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శన భాగ్యం ఇప్పుడు కీలక నేతలకు కూడా దుర్లభమే అన్నట్లుగా మారింది. పార్టీలో ఎవరైనా సరే కేటీఆర్ ను కలవాల్సిందే. ఆయన నిర్ణయమే ఫైనల్. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్లు ఎవరికి ఎవరికి ఇవ్వాలి. సిట్టింగులలో ఎవరిని పక్కన పెట్టాలి అన్న విషయాలు కూడా కేటీఆర్ నిర్ణయం ప్రకారమే జరుగుతాయని పార్టీ శ్రేణులు అంతర్గత సంభాషణల్లో విస్పష్టంగా చెబుతున్నారు.
అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వ్యవహారాలన్నీ కేటీఆర్ నిర్ణయం మేరకే జరుగుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులంతా ఆయననే కలుస్తున్నారు. ఇప్పటికే పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిన వారితో ఆయన వివరంగా మాట్లాడుతున్నారు. అలాంటి కన్ఫర్మేషన్ లేనివారిలో ఆయన ముభావంగా ముచ్చటిస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇక టికెట్ గ్యారెంటీ అన్న నేతలతో వేరుగా మాట్లాడుతూ ఎన్నికలు అక్టోబర్ మొదటి వారంలోనే జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, సమయం వృధా చేయకుండా క్షేత్ర స్థాయిలో పని చేసుకోవాలని చెబుతున్నారని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీకి 2018లో డిసెంబర్‌లో ఎన్నికలు జరిగాయి. ఆ మేరకు 2023 డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే తనకు ఉన్న సమాచారం ఎక్కడిదో, ఏమో తెలియదు కానీ కేటీఆర్ మాత్రం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మూడు నెలలు ముందుగానే అంటే అక్టోబర్ మొదటి వారంలోనే జరుగుతాయని పార్టీ నేతలకు నమ్మకంగా చెబుతున్నారు. ఎన్నికల సంఘానికి షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగా ఎన్నికలు నిర్వహించే అధికారం ఉంది.
అంతే కాకుండా తెలంగాణతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఈ ఏడాదే ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో జరుగుతాయని భావించాల్సి ఉంటుంది. అదే జరిగితే వచ్చే ఏడాది జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు కూడా ముందుకు జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. అంటే ఏపీ అసెంబ్లీకి కూడా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లేనని అంటున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఏపీ సహా ఏడేనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు జరగాలి వాటిని కూడా రెండు మూడు నెలలు ముందు జరిగే అవకాశాలున్నాయనీ. కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలు కూడా అలాగే ఉన్నాయనీ విశ్లేషిస్తున్నారు.