డిల్లీలో బొత్స లాబీయింగ్ దేనికో
posted on Feb 19, 2014 3:28PM
(3).jpg)
కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వార్తపై కేంద్రమంత్రి జైరాం రమేష్ స్పందిస్తూ అవసరమనుకొంటే రాష్ట్రపతి పాలన విధిస్తామని అన్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి తన పదవి నుండి తప్పుకొంటున్నారని రూడీ చేసుకోగానే, ఆపదవిపై చాలా కాలంగా కన్నేసిన పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ డిల్లీలో వాలిపోయి లాబీయింగ్ చేస్తున్నారు. కానీ పైకి మాత్రం తను రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకే డిల్లీకి వచ్చినట్లు చెప్పుకొంటున్నారు. రాష్ట్ర విభజన అనివార్యమయిన ఈ పరిస్థితుల్లో దానిని ఎలాగయినా ఆపెందుకే ప్రయత్నించాలి తప్ప, ముఖ్యమంత్రి రాజీనామా ఎందుకు చేసారు? ఆయన స్థానంలోకి ఎవరొస్తారు? రాష్ట్రపతి పాలన విదిస్తారా? వంటి రాజకీయాలు మాట్లాడటం సబబు కాదని ఆయన చాలా విచారపడుతూ తెలిపారు. అయితే ఆయన ప్రదాన్యాలేమితో, ఆయన డిల్లీలో ఎందుకు తిష్టవేసారో తేలికగానే ఊహించవచ్చును. ఈరోజు రాజ్యసభలో టీ-బిల్లుకి ఆమోదముద్ర పడగానే, ఇక ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాల ఏర్పాటు ఇక లాంచనప్రాయమే. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తనంతట తానే స్వయంగా అడ్డుతొలిగిపోయారు. పైగా ముఖ్యమంత్రి పదవికి సీమాంధ్ర నుండి చిరంజీవి, కన్నా లక్ష్మినారాయణ తప్ప గట్టి పోటీకూడా లేదు. కనుక ఇంతకంటే మంచి తరుణం ఉండదని బొత్స భావించడం సహజమే. అదీగాక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను, పీసీసీ అధ్యక్షుల నియామకాలకు ఎన్నికల నిబంధనలు అడ్డువచ్చేమాటయితే, అంతకంటే ముందుగానే ఎవరినో ఒకరిని అత్యవసరంగా ముఖ్యమంత్రిగా నియమించవలసి ఉంటుంది. అటువంటప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్రకు చెందిన వ్యక్తులను కంటే తెలంగాణా వ్యక్తులకే ప్రాధాన్యం ఈయవచ్చును. ఎందుకంటే, తెలంగాణాలో యంపీ సీట్లు సాధించుకోవడానికే ఇంత రిస్కు తీసుకొని ఇంత శ్రమపడింది గనుక. తెలంగాణాకు చెందిన వ్యక్తికే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా ప్రయోజనం పొందగలదు కానీ సీమాంధ్రకు చెందిన ఏ బొత్సకో కట్టబెట్టడం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు. బహుశః అందుకే పరిస్థితులు అంతా అనుకూలంగా ఉన్నాకూడా ఈ ఒక్క కారణంగా బొత్స లాబీయింగ్ చేయక తప్పడంలేదనుకోవాలి. అందువలన జైరాం రమేష్ చెప్పినట్లుగా ఎన్నికల ముందు కేంద్రం రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపకపోవచ్చును.