నాకు మాత్రం కర్నూలే రాజధాని: పవన్ కళ్యాణ్
posted on Feb 25, 2019 3:34PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. నిన్న కొండారెడ్డి ఖిల్లా వద్ద బహిరంగ సభ నిర్వహించగా.. ఆ సభకు జనసైనికులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. కాగా ఈరోజు పవన్.. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ ప్రజా సమస్యలను పట్టించుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా రాష్ట్ర పర్యటన చేస్తే ఏం ప్రయోజనమని పవన్ ప్రశ్నించారు. తాను ఓట్లు అడగడానికి రాలేదని, మార్పు కోసమే వచ్చానన్నారు. ప్రజల సమస్యలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని చెప్పారు. యువకుల్లో ప్రశ్నించే ధైర్యం ఉండాలన్నారు. ఈరోజు మనకి రాజధాని అమరావతి అయినా.. తన మనసుకు మాత్రం కర్నూలే రాజధాని అని పవన్ వ్యాఖ్యానించారు. అమరావతిని మించిన నగరంగా కర్నూలును తాను తీర్చిదిద్దుతానని చెప్పారు. ఎందరో రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ రాయలసీమను అభివృద్ధి చేయలేకపోయారని, తాను రాయలసీమకు పూర్వవైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలను తీర్చిదిద్దుతానని చెప్పారు.