సైరా షూటింగ్ ని అడ్డుకున్న ముస్లిం యువకులు
posted on Feb 25, 2019 4:11PM

అనుమతి తీసుకోకుండా ప్రభుత్వ స్థలంలో సెట్ వేశారంటూ గతంలో మున్సిపల్ అధికారులు 'సైరా నరసింహారెడ్డి' సెట్ ను పాక్షికంగా తొలగించి షూటింగ్ ని అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి అనుభవమే సైరా టీంకి మళ్ళీ ఎదురైంది. సైరా షూటింగ్‌ను కొంతమంది యువకులు అడ్డుకున్నారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు కర్ణాటకలోని బీదర్‌లో ఉన్న బహుమనీ సుల్తాన్ కోటలో సైరా టీం సర్వం సిద్ధం చేసుకుంది. చిత్రీకరణలో భాగం కోటలో హిందూ దేవతల విగ్రహాలను ఏర్పాటు చేశారు. అధికారుల నుంచి అనుమతి తీసుకుని చిత్రీకరణ ప్రారంభించారు. అయితే స్థానిక ముస్లిం యువకులు షూటింగ్‌కు అంతరాయం కల్గించారు. ముస్లిం కోటలో హిందూ దేవతల్ని నెలకొల్పడం ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ మేరకు వారు పోలీసుల్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు సెట్‌లోని దేవతల విగ్రహాల్ని తొలగించినట్లు సమాచారం.