అక్కడ ప్రచారం చేయాలి అంటే సంతకం పెట్టాలి

 

ఎన్నికలు వచ్చాయి అంటే ప్రజాప్రతినిధులతో గ్రామాలు కళకళలాడుతూ ఉంటాయి. హామీలతో ఓటర్లని ప్రలోభ పెడుతుంటారు. గెలిచిన తర్వాత మళ్ళీ ఆ గ్రామస్తుల మొహం కూడా చూడరు. ఏళ్ళు గడిచాయి ఎన్నాళ్లని ఆ గ్రామస్తులు మాత్రం అలానే నమ్ముతారు. ఇప్పుడు అందరు చైతన్య వంతులు అయ్యారు. ఒకప్పుడు ప్రజాప్రతినిధి అంటే ఆయనేదో దేశానికి రాజు అయినట్టు నెత్తి మీద పెట్టుకొని చూసుకునే వారు. కాలం మారింది వాళ్ళు కూడా మనలా సాధరణ వ్యక్తులే మన దయా దాక్షణ్యాల వల్లే బ్రతుకుతూ మనల్నే అణగదొక్కుతున్నారు అనే భావన మొదలయ్యింది. హామీలు నెరవేర్చకుంటే మొహం మీదే అడిగేస్తున్నారు. ప్రచారం చేయటానికి గ్రామంలోకి అడుగు కూడా పెట్టనివ్వటంలేదు.

తాజాగా మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేట గ్రామస్తులు ప్రచారానికి వచ్చిన బెల్లంపల్లి బీజేపీ అభ్యర్థి కొయ్యల హేమాజీ ని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు.  ప్రచారానికి వచ్చే అభ్యర్థులు రోడ్డు, తాగు, సాగునీరు కల్పించాలని బాండ్‌ పేపర్‌పై హామీ ఇవ్వాలని, లేని పక్షంలో గ్రామంలోనికి రానివ్వమని గ్రామస్థులు తేల్చిచెప్పారు. దీంతో తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఏమాజీ కోరారు. రాతపూర్వకంగా హామీ ఇస్తేనే నమ్ముతామని ప్రజలన్నారు. చేసేదేంలేక బీటీ రోడ్డు, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపడతానని వంద రూపాయల ప్రామిసరీ నోటుపై ప్రజల సమక్షంలో సంతకం చేశారు. అనంతరం గ్రామంలో ప్రచారం చేపట్టారు. అభ్యర్థులు ఎవరు గ్రామానికి వచ్చినా ఇలాగే స్పష్టమైన హామీ తీసుకుంటామని గ్రామస్తులు తెలిపారు.