నా పేరు పవన్.. ఆడా ఈడా ఎక్కడైనా ఉంటా!
posted on Jul 24, 2025 9:22AM
.webp)
తాను ఏ ఊరు వెడితే ఆ ఊరే తనది అంటానంటూ తనను హేళన చేస్తున్న మాజీ మంత్రి రోజా వంటి వారికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీటుగా బదులిచ్చారు. తన పేరు పవన్ అని.. తాను సర్వాంతర్యామిననని..అన్ని చోట్లా తిరుగుతుంటానని చెప్పారు. పవన్ అంటే గాలి అని గాలి లేని చోటు ఎక్కడా ఉండదనీ అన్నారు. తాను నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తనకు ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదన్నారు. తన సినిమా చూడమని కానీ, తనకు ఓటు వేయమని అడగడం కానీ రాదన్నారు.
రెండేళ్ల క్రితం విశాఖలో హోటల్ గదిలో నన్ను ప్రత్యర్ధుల అడ్డుకోవడానికి, అంతమొందించడానికి ప్రయత్నించారనీ, హోటల్ గదిలో బంధించి పోలీసులను మోహరించి తాను ఉంటున్న గది తలుపులను బూటు కాళ్లతో తన్నించారనీ గుర్తు చేశారు. ఆ సమయంలో తనకు అండగా మొత్తం విశాఖ నగరం నోవాటెల్ కు తరలి వచ్చిందన్నారు. ఆ అభిమానానికి గుర్తుగానే.. ఆ అభిమానానికి కృతజ్ణతగానే విశాఖలో హరిహర వీరమల్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశానన్నారు. తన జీవితాన్ని విశాఖ నగరం మార్చిందనీ.. ఇంట్లో ఉన్న నన్ను ప్రయోజకుడిగా చేసేందుకు అన్నయ్య చిరంజీవి వదిన నన్ను విశాఖ ఆ రోజు పంపించారని గుర్తు చేసుకున్నారు.