పార్లమెంట్ సమావేశాలు... తొలి వారం వృధా
posted on Jul 25, 2025 8:27PM

గత సోమవారం (జూలై 21) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. అయితే,తొలి వారం సమావేసాలు పూర్తిగా తుడిచి పెట్టుకు పోయాయి. ఐదు రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా సభ సజావుగా సాగింది లేదు. పహల్గాం ఉగ్రదాడి,ఆపరేషన్ సిందూర్’తో, ఆపరేషన్ సిందూర్ కాల్పుల విరమణకు సంబందించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వివాదాస్పద మధ్యవర్తిత్వం వ్యాఖ్యలతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం బీహార్’లో చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(ఎస్ఐఆర్)పై చర్చ చేపట్టాలని విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలను స్తంబింప చేయడంతో, అర్థవంతమైన చర్చ ’ఏదీ జరగ కుండానే తొలివారం పార్లమెంట్ సమావేశాలు ముగిసి పోయింది.
ఈ నేపధ్యంలో శుక్రవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో, వచ్చేవారం ప్రారంభంలో, (సోమ మంగళ వారాల్లో) ఆపరేషన్ సిందూర్' పై పార్లమెంటు ఉభయసభల్లో 32 గంటలపాటు ప్రత్యేక చర్చ చర్చ చేపట్ట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సోమవారం లోక్‌సభలో చర్చ అనంతరం మంగళవారం రాజ్యసభలో చర్చ ఉంటుందని చెప్పారు. లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 16 గంటల చొప్పున చర్చకు సమయం కేటాయించినట్టు వివరించారు.
'పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో సోమవారం ప్రత్యేక చర్చకు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది. విపక్షాలు పలు అంశాలు లేవెనెత్తాలని కోరుతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌పై చర్చను చేపట్టేందుకు మేము అంగీకరించాం' అని రిజిజు తెలిపారు.చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్టు విపక్షాలకు చెప్పామని, అయితే మొదటి రోజు నుంచీ విపక్షాలు పార్లమెంటు లోపల, వెలుపల ఆందోళన చేపట్టాయని రిజిజు అన్నారు. మొదటి వారంలో కేవలం ఒకే బిల్లు ఆమోదించామని,సభను సజావుగా సాగేలా చూడాలని విపక్షాలను కోరినట్టు చెప్పారు.నిబంధనల ప్రకారం వారు ఏ అంశాన్నైనా లేవనెత్తొచ్చని, పార్లమెంటు పనిచేయకపోతే దేశానికి నష్టం జరుగుతుందని అన్నారు.
అయితే, చర్చకు ప్రధానమంత్రి నరేంద మోదీ సమాధానం ఇవ్వాలన్న విపక్షాల, ముఖ్యమంగా ప్రతిపక్ష నేత రాహుల గాంధీ చేస్తున్న డిమాండ్’ను రిజిజు తిప్పికొట్టారు. ప్రభుత్వ పక్షాన ఎవరు మాట్లాడాలి, ఎవరు సమాధానం చెప్పాలి అనేది విపక్షాలు ఎలా నిర్ణయిస్తాయని ఆయన ప్రశ్నించారు. ఈసందర్భంగా రిజిజు, వితండ వాదంతో విపక్షాలు సభా సమయాన్ని , ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాయని విమర్శించారు.
అదలా ఉంటే, సబాహ కార్యక్రమాలను సజావుగా జరుపుకోవాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదిరినా, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(ఎస్ఐఆర్) వివాదం కొనసాగుతోంది. విపక్ష పార్టీలు , ఎస్ఐఆర్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తుంటే, ఎన్నికల సంగహం ససేమిరా అంటోంది.
మరోవంక రాజ్యాంగ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమంపై పార్లమెంట్’లో చర్చించే ప్రశ్నే లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవంక, ఎస్ఐఆర్‌ను ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ గట్టిగా సమర్థించుకున్నారు. నకిలీ ఓటర్లు ఓటేయడానికి అనుమతించే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో అసలైన ఓటర్లను తీసివేస్తున్నామన్న విపక్షాల ఆరోపణలను ఖండించారు. ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. ఈ నేపద్యంలో, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఎంతవరకు అమలవుతుందో చూడవలసిందే