పాదయాత్రను ప్యారడైజ్ అడ్డుకుంటుందా..?


ఏ ముహూర్తాన పాదయాత్ర చేయాలని జగన్ అనుకున్నాడో తెలియదు కానీ.. అది అనుకున్నదగ్గర నుండి జగన్ కు ఏదో ఒక ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ఏదోలా పాట్లు పడి... అక్కడా.. ఇక్కడా అనుమతులు తీసుకొని పాదయాత్ర మొదలుపెట్టాడు. కానీ ఏం చేస్తాం.. జగన్ జాతకం అంత బావుంది మరి. ఆదిలోనే హంసపాదు అన్న సామెత ప్రకారం... అలా పాదయాత్ర మొదలుపెట్టాడో లేదో ఇలా "ప్యారడైజ్ పేపర్స్" అంటూ జగన్ నెత్తిన పిడుగు పడింది. ప్యారడైజ్ పేపర్స్ ఏంటి... జగన్ కు వాటితో సంబంధం ఏంటీ అనుకుంటున్నారా..? అది తెలియాలంటే స్టోరీలోకి వెళదాం...

 

గత కొంతకాలం క్రితం ‘పనామా పేపర్స్’ పేరుతో నల్లధనం కుబేరుల లిస్ట్ బయటకు వచ్చి సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు.. "ప్యారడైజ్ పేపర్స్" పేరుతో అంతర్జాతీయంగా పన్న ఎగొట్టిన వారి పేర్లు బయటకు వచ్చాయన్నమాట. 180 దేశాలకు చెందిన డేటా లీకవగా అందులో సంఖ్యా పరంగా భారత్ 19వ స్థానంలో నిలిచింది. అందులో 714 మంది భారతీయ కుబేరులు పన్ను ఎగ్గొట్టిన వారే కావడం గమనార్హం. ఇక ఇందులో కూడా మన జగన్ గారి పేరు కూడా ప్రస్తావనకు వచ్చిందట. ఇప్పటికే లక్ష కోట్ల అవినీతి ఆరోపణ నేపథ్యంలో జైలు జీవితం గడిపి.. ఇప్పటికీ ఆ కేసు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్ కు.. ఇప్పుడు "ప్యారడైజ్ పేపర్స్" పుణ్యమా అంటూ ఈ వ్యవహారంలో కూడా ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇంకేముంది పాదయాత్ర ప్రారంభించిన రోజే బాంబులాంటి ఈ వార్త బయటకు రావడంతో వైసీపీలో కలకలం మొదలయ్యింది. అయితే జగన్ గురించిన ప్రస్తావన నామమాత్రంగానే వచ్చిందని, దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి జగన్ పాదయాత్రకు ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. ఇప్పటికే.. వారంలో ఒకరోజు తప్పనిసరిగా కోర్టుకు హాజరవుతున్న జగన్ ప్రతిష్టను.. ప్యారడైజ్ పేపర్స్ వ్యవహారం మరింత మసకబార్చినట్లు కనిపిస్తోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో..