చంద్రబాబు చేసిన ఆ ఒక్క పొరపాటు..

 

చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ఏం లాభం.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి అలానే ఉంది. అంతా అయిపోయిన తరువాత ఇప్పుడు తెలంగాణలో మీటింగ్ పెట్టి ఆయన ఏం సాధిస్తారో అర్దం కాని పరిస్థితి. అసలే రాష్ట్రం విడిపోవడంతో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కొంతమంది నేతలైతే ముందుగానే భయపడిపోయి అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ఇక ఉన్న వారినైనా కాపాడుకోకుండా... వారిని సంతృప్తి పరకుండా చంద్రబాబు పొరపాటు చేశారు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డిలాంటి వ్యక్తి కూడా పార్టీ నుండి బయటకు వెళ్లే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం విడిపోయిన తరువాత చంద్రబాబు ఏపీ పై పెట్టిన శ్రద్ద తెలంగాణపై  పెట్టి ఉండే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేది.

 

నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు పార్టీకి దొరకడం చాలా అదృష్టమే. అలాంటి వ్యక్తికి ఎలాంటి పదవి ఇచ్చినా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు అక్కడే పొరపాటు చేశారు. ఏపీలో టీడీపీ ఎలాగూ అధికారంలోకి వస్తుంది. కానీ తెలంగాణలో రావాలంటే కొంచం కష్టమైన పనే. అసలే తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన పార్టీ. అలాంటి పార్టీకి ఎదురునిలవాలంటే ప్రతిపక్షపార్టీకి కూడా అంతే బలముండాలి. ఈ నేపథ్యంలోనే తెలంగాణపై కాస్త దృష్టిపెట్టి నేతలు, కార్యకర్తలతో టచ్ లో ఉంటూ.. అప్పుడప్పుడూ మీటింగ్ లు పెడుతూ ప్రజలకు దగ్గర ఉంటే ఏమన్నా ఫలితం ఉండేది. పోనీ పార్టీలో ఉన్న కొద్ది మంది నేతలకైనా పదవులు ఇచ్చారంటే అదీ లేదు. పార్టీ ఫండ్ కు ఆశపడి మల్లారెడ్డికి ఎంపీ పదవిని కట్టబెట్టారు. ఆ పదవి ఏదో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికి కట్టబెట్టి ఉంటే బావుండేది. అదిపోనీ.. కేంద్రం ఇచ్చిన రెండు సీట్లలో అయినా చంద్రబాబు టీటీడీపీ నేతలకు ఇచ్చి.. ఒకరిని ఎంపీ.. ఒకరిని కేంద్రమంత్రిగా కూర్చోపెట్టి ఉంటే వ్యవహారం మరోలా ఉండేది. ఏదో ఒక రకంగా పార్టీని బ్రతికించేవాళ్లు. ఆ రెండు సీట్లు కాస్త తీసుకెళ్లి ఏపీ వాళ్లకే కట్టబెట్టారు. చంద్రబాబు చేసిన బ్లండర్ మిస్టేక్ ఇదే. దీంతో టీటీడీపీ నేతల్లో అసంతృప్తి నెలకొంది.

 

దానికి తోడు ఈ మధ్య టీడీపీ-టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయి అన్న వార్తలు చాలా జోరుగానే వినిపించాయి. అది నిజంగా జరుగుతుందో లేదో తెలియదు కానీ.. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం... ఇలాంటి వార్తలు పుట్టిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి పార్టీని వీడిపోవాల్సి వచ్చింది. స్వతహాగా రోషం, పౌరుషం ఉన్న రేవంత్ రెడ్డి.. తనను జైలుకు పంపిన వ్యక్తితోనే కలిసిఉండాలని.. జరిగే పరిణామాలను ఊహించలేకే పార్టీని గుడ్ బై చెప్పేశాడు. కారణం ఏదైనా కానీ రేవంత్ రెడ్డి మాత్రం పార్టీని వీడిపోయాడు. ఇంతకు ముందు కూడా టీడీపీ నేతలు పార్టీ మారారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పోతూ పోతూ తనతో పాటు పార్టీని మొత్తం ఊడ్చేసుకొని తీసుకుపోతున్నాడు. దీనికి కారణం ఎవరో కాదు... స్వతహాగా పార్టీ అధినేతే కారణం. మరి ఇప్పుడు పార్టీని ఎలా కాపాడుకుంటారో ఆయన నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది.