పాకిస్థాన్‌కి సత్తా చాటిన భారత సైన్యం

 

జమ్ము - కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం ఓవర్ యాక్షన్ చేసి భారత సైనికుల మీద, భారత భూభాగంలోని జనావాసాల మీద కొద్ది రోజుల క్రితం విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పులలో అనేక ఇళ్ళు ధ్వంసం కాగా, ఇద్దరు మరణించారు. గత రెండు రోజుల నుంచి పాకిస్థాన్ సైనిక మూకలు కాల్పులు జరపడం ఆపేశారు. భారత సైన్యం చూపిన సత్తాయే పాక్ సైనికులు గప్‌చుప్ అయిపోవడానికి కారణమని తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాకిస్థాన్ సైనికులకు గతం నుంచీ ఒక ఆటలా వుండేది. యుపిఎ హయాంలో సరైన ఆయుధ సంపత్తి లేక, దూకుడుగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వం లేక భారత సైనికులు చేతులు కట్టేసినట్టు వుండేవారు. ఎన్టీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైనికులలో ఆత్మస్థైర్యాన్ని పెంచే ఎన్నో చర్యలు తీసుకున్నారు. పాకిస్థాన్ సైనికులు ఎక్కువ చేస్తే వారిని అదుపులోకి తేవడానికి అవసరమైన పూర్తి ఆయుధ సంపత్తితోపాటు నైతికంగా వారికి పూర్తి మద్దతు ఇచ్చారు. దాంతో భారత సైనికులు పాకిస్థాన్ సైనికులను విజయవంతంగా కట్టడి చేయగలిగారు.

 

భారత ప్రధానమంత్రి కార్యాలయం పాకిస్థాన్ సైనికులు కాల్పులు ప్రారంభించగానే తగిన చర్యలను తీసుకోవాలని సైనిక వర్గాలను ఆదేశించింది. గతంలో మాదిరిగా సందేహించాల్సిన అవసరం లేదని, పాకిస్థాన్ సైనికుల విషయంలో దూకుడుగా వ్యవహరించొచ్చని చెప్పింది. పాక్ సైనికులను తిప్పికొట్టడానికి భారీ ఆయుధ సంపత్తిని ఉపయోగించాలని సూచించింది. ప్రభుత్వం నుంచి సూచనలు అందుకున్న భారత సైనికులు తమ ప్రతాపం చూపించారు. దాదాపు ఐదు లక్షల బుల్లెట్లు వర్షంలాగా కురిపించారు. భారత సైనికులు జరిపిన కాల్పుల వల్ల పాకిస్థాన్ అధికారికంగా బయటపెట్టకపోయినప్పటికీ, వందల సంఖ్యలో పాకిస్థాన్ సైనికులు మరణించారని తెలుస్తోంది. పాకిస్థాన్ సైనికులతోపాటు సరిహద్దులు దాటి రావడానికి ప్రయత్నించిన జిహాదీ మూకలు కూడా మరణించాయని తెలుస్తోంది. భారత సైనికులు తీవ్రంగా కాల్పులు ప్రారంభించగానే, అప్పటి వరకూ సరిహద్దుల దగ్గర గోతికాడ నక్కల్లా కాచుకుని వున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాద జిహాదీ గ్రూపుల వారు దాదాపు 500 మంది చెట్టుకొకరుగా పుట్టకొకరుగా పారిపోయారని తెలుస్తోంది. భారత సైన్యం జరిపిన భారీ కాల్పుల్లో దాదాపు 90 పాకిస్థానీ సైనికుల శిబిరాలు ధ్వంసమైపోయాయని సమాచారం. భారత సైనికులు చూపిన తెగువ పాకిస్థానీయులను బిత్తరపోయేలా చేసిందని, తిరిగి ఇప్పట్లో పాకిస్థాన్ సైనికులు భారత భూభాగం మీద కాల్పులు జరిపే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.