ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు?

 

మరో ఇరవై రోజుల్లో నవంబర్ 1వతేదీ వస్తుంది. ఇంతవరకు ఆరోజును రాష్ట్ర అవతరణ దినోత్సవంగా పాటిస్తున్నాము. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన జరగడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలనే చర్చ మొదలయింది. కొందరు అదే రోజున జరుపుకోవాలని సూచిస్తుంటే మరి కొందరు ఆంద్ర, తెలంగాణాలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన రోజున అంటే జూన్2న జరుపుకోవాలని వాదిస్తున్నారు. కానీ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. కనుక ప్రజలలోనే కాదు ప్రభుత్వ అధికారులలో కూడా ఈ విషయంలో సందిగ్దత నెలకొని ఉంది. ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై నిర్ణయం తీసుకోకపోతే, నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు నిర్వహించవలసి ఉంటుంది కనుక దానికి తగిన ఏర్పాట్లు చేయడానికి సమయం సరిపోదని అధికారులు భావిస్తున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. అయితే ఈ విషయంలో ప్రతిపక్షాలను కూడా సంప్రదిస్తే అనవసర రాద్ధాంతం నివారించవచ్చును.