‘అవయవదాతా.. స్పూర్తీభవ..’  మానవత్వపు హృదయాలు మరిన్ని చిగురించాలి!!

అన్నదాతా  సుఖీభవ.. అనే మాటలు ఎన్నోచోట్ల ఎంతోమంది నోట వినే ఉంటారు. మరీ ముఖ్యంగా ఆకలితో నకనకలాడే కడుపు నింపినప్పుడు అన్నదాతా సఖీభవా.. అని దీవించడం పరిపాటి. అయితే ఇప్పుడు మరొక కొత్త నినాదం దేశం యావత్తు స్మరించాలి. అవయవదాతా స్పూర్తీభవ అని కొత్తగా కొనియాడాలి. అన్నం పెడితే.. ఆకలి తీరితే.. అది ఒక పూట, ఒకరోజు మనిషికి శక్తినిచ్చి ప్రాణం నిలబెడుతుంది. కానీ అవయవదానం చేస్తే పునర్జన్మను ప్రసాదించినట్టే. ఒకప్పుడు అవయవదానం చెయ్యాలంటే ఎంతో కష్టం ఉండేది. ఎన్నెన్నో అపోహలు కూడా ఉండేవి. అవయవదానం చేసినవారు నరకానికి పోతారనే నమ్మకం పలువురిని అలాంటి మహోన్నతమైన అదృష్టానికి దూరం చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దేశం అభివృద్ది చెందుతూ మనిషి ఆలోచనా తీరును కూడా మార్చేస్తోంది. దేశంలో పెరుగుతున్న అవయవదాన సంఘటనలు ఎంతోమందికి జీవితాల మీద కొత్త ఆశ కలిగిస్తోంది.  భారతదేశంలో 13వ అవయదాన వేడుకల సందర్భంగా వెలువడిన మరణ గణాంకాలు, అవయవదాన లెక్కలు, దీన్ని ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన మార్పు చేర్పులు తెలుసుకుంటే..

అన్నం ఒక పూట కడుపు నింపితే అవయవదానం  ఒక జన్మాంతం ప్రాణాన్ని నిలబెడుతుంది. అందుకే అవయవదానం ఎంతో గొప్పదిగా పేర్కొనబడింది. పదేళ్ల కిందట అంటే 2013లో మన దేశంలో నమోదైన అవయవదానాలు 5000.  పదేళ్ళ తరువాత ప్రస్తుతం 2023లో ఈ సంఖ్య 15వేలకు చేరింది. అంటే 10ఏళ్ళలో మూడురెట్ల మెరుగుదల సాధ్యమైంది. అవయవదానం మీద అవగాహన పెంచడం వల్లనే ఈ గణాంకాల పెరుగుదలకు కారణమనే విషయం అందరూ ఒప్పుకుని తీరాలి.  భారతదేశంలో ప్రతి సంవత్సరం 95లక్షలమంది మరణిస్తున్నారు. వీరిలో కనీసం లక్ష మంది దాతలుగా నమోదైన వారున్నారు. అయినప్పటికీ అవయవాల వైఫల్యం కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. ప్రతి రోజూ 300మంది అవయాల వైఫల్యం కారణంగా మృతిచెందుతున్నారు. వీటన్నిటికి పరిష్కారం ఒకే ఒక్కటి. అదే అవయవదానాన్ని ప్రోత్సహించడం, అవయవదానం గురించి అవగాహాన పెంచడం.

అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు గానూ ప్రభుత్వం చట్టంలో కూడా కొన్ని మార్పులు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా అవయవదానం కోసం వ్యక్తి నిర్ణీత  వయసు 65సంవత్సరాలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిమితిని తొలగించారు. ఇంకా అవయవదానం గురించి అవగాహన పెంచి, దీన్ని ప్రజలలో వ్యాప్తి చేయడానికి మరిన్ని సవరణలు, సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం సంసిద్దంగా ఉంది. దీని కారణంగా ప్రతి సంవత్సరం ఎంతో మందిని మృత్యువు నుండి బయటపడేయవచ్చు. భారతదేశంలో లివర్ ఫెయిల్, లివర్ క్యాన్సర్ కారణంగా ప్రతి ఏడూ 2లక్షల మంది మరణిస్తున్నారు. వీరిలో 10-15శాతం మందికి సకాలంలో కాలేయ మార్పిడి చేయడం ద్వారా రక్షించే అవకాశం  ఉంది.  ప్రతి ఏడూ 25 నుండి 30వేల మందికి కాలేయ మార్పిడి చేయాల్సి ఉండగా  కేవలం 1500 మందికి మాత్రమే మార్పిడి జరుగుతోంది. దీనంతటికీ కారణం అవయదానం కోసం ఎదురుచూసేవారికంటే అవయవదాతలు తక్కువగా ఉండటమే. ఇక గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి, కంటిమార్పిడి గురించి చెప్పుకోవడం వృథా.. అందుకే భారతదేశంలో అవయవదానాన్ని ప్రోత్సహించాలి. అవయవదానానికి ముందుకొచ్చినవారిని అవయవదాతా స్పూర్తీభవా.. అని కొనియాడాలి.

                                                   *నిశ్శబ్ద.