కాంగ్రెస్‌లో కల్వకుంట్ల కవితకు నో ఎంట్రీ : టీ పీసీసీ చీఫ్
posted on Jan 13, 2026 3:56PM
.webp)
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ తేల్చిచెప్పారు.. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాజాగా మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్ మాట్లాడుతూ..తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి గతం తప్ప.. భవిష్యత్తు లేదంటూ వ్యాఖ్యానించారు.
మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి కవిత నిజాలు చెప్తున్నారన్నారు. తాము చేసిన ఆరోపణలపై కవిత సమాధానం రూపంలో రుజువైందని చెప్పారు. కవిత మాటలతో కేసీఆర్ అవినీతి నిజమని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్.. కుమారుడికి ఒక జిల్లా, కూతురికి ఒక జిల్లా, అల్లుడికి ఒక జిల్లా ఇచ్చారని పీసీసీ చీఫ్ ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ అశాస్త్రీయంగా జిల్లాలను విభజించారని మండిపడ్డారు.
శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేయాలని కమిటీ వేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్‌ను ఎవరు ముట్టుకున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ గాబరాపడుతున్నారని ప్రశ్నించారు. వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. మహిళా అధికారులపై ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే ఎంత ఇబ్బంది పడతారో అర్థం చేసుకోవాలన్నారు. సోషల్ మీడియాను కట్టడి చేయాలన్నారు. పదేళ్లలో వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? రెండేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో నిరుద్యోగులు అర్థం చేసుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.