సుప్రీం కోర్టు ఒక్క రూపాయి జరిమానాపై స్పందించిన ప్రశాంత్ భూషణ్
posted on Aug 31, 2020 6:40PM
కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీం కోర్టు ఈరోజు ఒక్క రూపాయి జరిమానా విధించిన సంగతి తెలిసిందే. తాజాగా కొద్దిసేపటి క్రితం ఈ తీర్పు పై స్పందించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఒక్క రూపాయి లాంఛన జరిమానా చెల్లించేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. అయితే ఈ తీర్పుపై రివ్యూ కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేస్తానని కూడా ఆయన తెలిపారు. తనకు న్యాయవ్యవస్థ మీద అపార గౌరవం ఉందనీ.. అయితే తాను ట్వీట్లు పెట్టడం వెనుక సుప్రీంకోర్టును గానీ, న్యాయవ్యవస్థను గానీ అగౌరవపరిచే ఉద్దేశం తనకు ఎంత మాత్రం లేదని ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ట్విటర్లో చేసిన ఆరోపణలపై కోర్టు ధిక్కారం కింద ప్రశాంత్ భూషణ్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వచ్చేనెల 15 లోగా ఒక్క రూపాయి జరిమానా చెల్లించాలనీ.. లేని పక్షంలో మూడు నెలలు జైలు శిక్ష లేదా మూడేళ్లపాటు ప్రాక్టీస్‌పై నిషేధం తప్పదని సుప్రీంకోర్టు తన తీర్పులో హెచ్చరించింది.